లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను యూపీ పోలీస్‌లు మట్టుబెట్టారు. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. ఈ క్రమం లోనే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ పోస్టులపై గ్రనేడ్ దాడులు జరిపిన సంఘటనల్లో వీరు నిందితులుగా ఉన్నారు.
తాజాగా వారి ఆచూకీ యూపీ లోని పీలీబీత్ జిల్లాలో లభ్యం కావడంతో యూపీ, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి పురానాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితులను అదుపు లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నిందితులు గుర్వీందర్‌సింగ్, వీరేంద్ర సింగ్, జసన్‌ప్రీత్ సింగ్ గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని పంజాబ్ డీజీపీ వెల్లడించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నిందితుల నుంచి ఏకే రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాక్ మద్దతు ఉన్న ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ సభ్యులని పంజాబ్ పోలీసులు వెల్లడించారు.