బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవుల్లో సోమవారం ఉదయం నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వ్యక్తులు నక్సల్స్ లేక పౌరులా అన్నది నిర్ధారణ కాలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. భద్రతా సిబ్బందిలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు.
అంతర్-జిల్లా సరిహద్దులోని సిల్గేర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపుపై నక్సల్స్ కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించారని బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ పి తెలిపారు.
గత వారం పోలీసు క్యాంపు ప్రారంభించడంపై మావోయిస్టులకు పట్టున్న ప్రాంతంగా భావిస్తున్న సిల్గేర్‌లో కొందరు స్థానికులు నిరసన తెలుపుతున్నారు. నక్సల్స్ నుంచి ఒత్తిడి రావడంతోనే గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారని పోలీసులు చెప్పారు. గ్రామస్తుల నిరసనల మాటున సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నక్సల్స్ కాల్పులు ప్రారంభించారని, వారి కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని ఐజి చెప్పారు. ఆ ప్రదేశంలో మూడు మృతదేహాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని, వారి వివరాలు తెలియరావలసి ఉందని ఐజి చెప్పారు. సుక్మా జిల్లాలో ఏప్రిల్ 3న 22 మంది భద్రతా సిబ్బందిని నక్సల్స్ హతమార్చిన ప్రదేశం సిల్గేర్ క్యాంపునకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3 killed in Encounter in Chhattisgarh