ముగ్గురు అటవీ కార్మికుల మృతి
గోండియా /నాగపూర్: మహారాష్ట్రలోని నావేగావ్-నాగ్‌జీరా పులుల అభయారణ్యంలో(ఎన్‌ఎన్‌టిఆర్) మంటలు చెలరేగగా వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ముగ్గురు కార్మికులు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాలలో గురువారం ఉదయం నిప్పు పెట్టారని, మంటలు వ్యాపిస్తుండడంతో అప్రమత్తమైన 50-60 మంది అటవీ అధికారులు, కార్మికులు వాటిని ఆర్పేందుకు చర్యలు చేపట్టారని నవెగావ్-నాగ్‌జీరా పులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్, ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎం రామానుజమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాయంత్రం 5 గంటలకల్లా మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయని, అయితే బలమైన గాలులు వీచడంతో మళ్లీ మంటలు వ్యాపించి ముగ్గురు అటవీ కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఇలా ఉండా ఈ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.