దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నకిలీ నోట్లు ముద్రిస్తూ, సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అనాస్ ఖాన్(20), అమన్ కుమార్(25), వికాస్ కుమార్(24) నుంచి రూ. 1.40 లక్షల విలువైన రూ. 200 కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ద్వారక డిసిపి అంకిత్ సింగ్ మంగళవారం తెలిపారు. నకిలీ నోట్లను సరఫరా చేసేందుకు ద్వరకా మోర్ మెట్రో స్టేషన్ వద్దకు అనాస్ ఖాన్ వస్తున్నట్లు ఆగస్టు 5న తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. మోట్రో స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అతడిని తనిఖీ చేయగా రూ. 200 నకిలీ కరెన్సీ నోట్లు 301 దొరికినట్లు డిసిపి తెలిపారు.
తనకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని, అతడికి నికలీ కరెన్సీని సరఫరా చేస్తున్నానని అనాస్ ఖాన్ దర్యాప్తులో చెప్పాడని ఆయన తెలిపారు. ఖాన్ వాంగ్మూలం ఆధారంగా ఆగస్టు 6న నికలీ నోట్లను అందచేయడానికి వచ్చిన వికాస్ కుమార్, అమన్ కుమార్‌లను పీరాగఢి మెట్రో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. వికాస్ కుమార్ గతంలో హర్యానాలో కూడా అరెస్టయ్యాడని ఆయన తెలిపారు. వికాస్ కుమార్‌కు చెందిన డిసిఎం కాలనీలోని ఇంటి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, నకిలీ భారతీయ కరెన్సీని ముద్రించడం కోసం ఉపయోగిస్తున్న రెండు ప్రింటర్లు, ఒక లాప్‌టాప్, ఫ్రేమ్, వాటర్ మార్క్, ఇంక్‌తోసహా ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి తెలిపారు. ముఠాలోని ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.