ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్రవాదులు జరిపిన కాల్పులలో ఒక వ్యక్తి, అతని కుమారుడితోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. క్వాక్తా గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి అనంతరం కత్తులతో పొడిచారని శనివారం ఉదయం పోలీసులు తెలిపారు. ముష్కరులు చురచంద్‌పూర్ నుంచి వచ్చినట్లు వారు తెలిపారు.
మరణించిన ముగ్గురు వ్యక్తులు సహాయ శిబిరాలలో ఉండేవారని, పరిస్థితి మెరుగుపడడంతో శుక్రవారం మధ్యాహ్నమే వారు తమ స్వగ్రామం క్వాక్తా తిరిగివచ్చారని పోలీసులు వివరించారు. ఈ సంఘటన దరిమిలా క్వాక్తాలో గుమికూడిన గ్రామస్తులు చురచంద్‌పూర్ వెళ్లేందుకు బయల్దేరారని, వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పోలీసులు చెప్పారు.
ఇలా ఉండగా క్వాక్తా సమీపంలో శనివారం ఉదయం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ఒక పోలీసుతోసహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఇంఫాల్‌లోని మెడిసిటీకి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా..తాజా ఘర్షణలను పురస్కరించుకుని కర్ఫూ సడలింపు వేళలను జిల్లా యంత్రాంగం కుదించింది. రెండు ఇంఫాల్ జిల్లాలలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు కర్ఫూ సడలించగా ఇప్పడు దాన్ని ఉదయం 5 నుంచి ఉదయం 10.30 వరకు కుదించినట్లు అధికారులు చెప్పారు.