Saturday, November 23, 2024

బెంగళూరులో చిక్కిన ముగ్గురు శ్రీలంక క్రిమినల్స్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: శ్రీలంకలో దాదాపు 12 హత్యలతో సంబంధమున్న ముగ్గురు శ్రీలంక జాతీయులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఫిషింగ్ బోట్ ద్వారా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఈ ముగ్గురు శ్రీలంక జాతీయులు రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న జై పరమేష్ అనే 42 ఏళ్ల హత్య కేసు నిందితుడు ఈ ముగ్గురికి తాను అద్దెకున్న ఫ్లాట్‌లో ఆశ్రయమిచ్చాడు.

తనపై నమోదైన హత్య కేసుకు సంబంధించిన కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న పరమేష్‌ను అరెస్టు చేసేందుకు సిసిబి పోలీసులు వలవేయగా అతనితోపాటు ఈ ముగ్గురు శ్రీలంక జాతీయులు కూడా అందులో పడ్డారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా సిసిబికి చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు బుధవారం జక్కూరులోని విశ్వ ప్రకృతి గ్రీన్ వుడ్స్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. ఫ్లాట్‌లో పరమేష్‌తోపాటు కన్నడ, తమిళ్, హిందీ భాషలు ఏవీ మాట్లాడలేని మరో ముగ్గురు వ్యక్తులు అధికారులకు కనిపించారు. వారి వద్ద భారతీయ గుర్తింపు పత్రం ఏదీ లభించలేదు. తాము శ్రీలంక నుంచి వచ్చామని వచ్చీరాని ఇంగ్లీష్‌లో ఆ ముగ్గురూ తెలిపారు. వారి దద్ద పాస్‌పోర్టులు కాని వీసాలు కాని లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించగా వారి నేరచరిత్ర బయటపడింది.

వారిని కొలంబో సమీపంలోని గంఫాకు చెందిన కసన్ కుమార శంక, కడువేలాకు చెందిన అమిలా నువాన్, కొలంబోకు చెందిన రంగ ప్రసాద్‌గా గుర్తించారు. శంకకు నాలుగు హత్యలతో సంబంధం ఉందని, నువాన్‌కు ఐదు హత్యలతో, రంగ ప్రసాద్‌పై రెండు హత్య కేసులతో సంబంధం ఉందని అధికారులు గుర్తించారు. ఫ్లాట్‌లో నుంచి స్థానిక నివాసులకు చెందిన 23 ఆధార్ కార్డులు, 13 మొబైల్ ఫోన్లు, 9 శ్రీలంకకు చెందిన విజిటింగ్ కార్డులు మొత్తం 53 వస్తువులను ఫ్లాట్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరమేష్‌తోపాటు ఆ ముగ్గురు శ్రీలంక అనుమానితులను సిసిబి అధికారులు అరెస్టు చేశారు.

ధనుష్కోడి-రామేశ్వరం మార్గం ద్వారా ఈ శ్రీలంక జాతీయులు దేశంలోకి చొరబడ్డారని, శ్రీలంకలో ఈ ముగ్గురూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయి ఉండవచ్చని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎస్డి శరణప్ప తెలిపారు. వీరు భారత్‌కు ఎందుకు వచ్చారో ఇంకా తెలియరాలేదని, శ్రీలంక అధికారులను తాము ఇంకా సంప్రదించవలసి ఉందని ఆయన చెప్పారు. ఈ ముగ్గురూ నిషిద్ధ ఎల్‌టిటిఇ తీవ్రవాదులు కూడా అయ్యే అవకాశం లేకపోలేదని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే వీరికి తమిళం మాట్లాడటం రాదని సిసిబి అధికారులు చెబుతున్నారు. వీరిపై శ్రీలంకలో లుక్‌అవుట్ నోటీసు ఏదైనా ఉందా అన్న విషయాన్ని సిసిబి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News