జమ్ము: జమ్మూకాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ నగరంలోని నాలుగు రద్దీ ప్రాంతాల్లో ఐఇడి బాంబులతో పేలుళ్లు జరిపేందుకు పన్నిన భారీ కుట్రను భగ్నం చేసినట్టు జమ్మూప్రాంత ఐజి ముకేశ్‌సింగ్ తెలిపారు. ఈ కుట్రలో భాగస్వాములుగా గుర్తించిన నలుగురిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. జమ్మూ బస్టాప్‌లో ఓ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుహెయిల్ బషీర్‌షా అనే యువకుడిని పట్టుకోవడంతో ఈ భారీ కుట్ర వెలుగు చూసిందని ఆయన తెలిపారు. అతని నుంచి సుమారు ఏడు కిలోల ఐఇడి బాంబును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దానిలో ఆర్‌డిఎక్స్‌లాంటి పేలుడు పదార్థాలు కలిపారా అన్నది నిపుణులు తేలుస్తారని ఆయన చెప్పారు.
పుల్వామా జిల్లా నేవా గ్రామానికి చెందిన సుహెయిల్ చండీగఢ్‌లో నర్సింగ్ విద్యార్థి అని సింగ్ తెలిపారు. అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు పాక్ ఉగ్రసంస్థ అల్‌బదర్‌కు చెందిన అథర్‌షకీల్‌ఖాన్, కాశ్మీర్‌కు చెందిన ఖాజీ వసీమ్(సుహెయిల్ సహ విద్యార్థి), శ్రీనగర్‌కు చెందిన అబీద్‌నబీ ఉన్నారు. వీరందరినీ వేర్వేరు చోట్ల నుంచి పోలీస్ బృందాలు సమన్వయంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నాయి. గత నాలుగు రోజులుగా జమ్మూకాశ్మీర్‌లోని అనుమానిత ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. మరో పరిణామంలో సాంబా జిల్లాలో సోదాలు నిర్వహించి ఆరు పిస్టళ్లు, 15 చిన్నసైజ్ ఐఇడి బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారు.
3 Suspects arrested over foiled IED in Jammu