శ్రీనగర్: కశ్మీర్ లోని పుల్వామాలో శనివారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శనివారం రాత్రి దర్బ్‌గామ్ వద్ద భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు దాదాపు 12 గంటల పాటు సాగాయి. మృతులైన ఉగ్రవాదులు జునైద్ షీర్గోజ్రీ, ఫైజల్ నాజర్ భట్, ఇర్ఫాన్ అహ్ మాలిక్‌లుగా గుర్తించారు. వీరంతా స్థానికులేనని, వీరు లష్కరే తొయిబా గ్రూప్‌కు చెందిన వారేనని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వీరిలో జునైద్ అనే ఉగ్రవాది గతంలో కశ్మీర్ పోలీస్‌కు చెందిన రియాజ్ అహ్మద్‌ను హత్య చేశాడని తెలిపారు. వీరి ముగ్గురు నుంచి రెండు ఏకే 47లు, ఒక పిస్తోల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఉగ్రవాదులు స్థానిక యువతను ఆకర్షించి 15 రోజుల పాటు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి, ఆ తరువాత వారితో నేరాలు చేయిస్తున్నట్టు జమ్ముకశ్మీర్ పోలీసులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో ఎక్కువగా స్థానిక ఉగ్రవాదులే ఉండటం ఇందుకు చిహ్నంగా నిలిచింది.
3 Terrorists Killed in Encounter in Pulwama