జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద రెండు చోట్ల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు గురువారం వెల్లడించారు. రెండు ఎకె రైఫిళ్లు, పిస్టల్, నాలుగు హేండ్ గ్రెనేడ్లు, ఇతర విధ్వంస సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో బుధవారం రాత్రి మాచల్ , తంగ్దర్ ప్రాంతాల్లో పోలీస్‌లతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.అనుమానాస్పద కదలికలు గమనించి కాల్పులు జరపగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని చినార్ కార్ప్ సైనిక విభాగం తెలిపింది. అలాగే తంగ్ధర్ ప్రాంతంలో మరో ఉగ్రవాది హతమయ్యాడు.
ఈ రెండు సంఘటనల ఆపరేషన్ ఆగస్టు 28న ప్రారంభమైంది. కర్నా సెక్టార్, మాచిల్ సెక్టార్ లోని కుంకడి వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని, బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కుంకడిలో అనుమానాస్పద కదలికలు కనిపించగా కాల్పులు ప్రారంభమై గురువారం ఉదయం వరకు కొనసాగాయని అధికారులు తెలిపారు. అలాగే కర్నా సెక్టార్‌లో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు పసిగట్టారు. పరస్పర కాల్పులు ప్రారంభమై ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు. ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి