Thursday, January 23, 2025

ఇన్ఫెక్షన్ రేటును తగ్గించడానికి 3 టైర్ సిస్టమ్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని ఒక ముఖ్యమైన నూతన విధానం వైపు మనం అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిమ్స్ వేదికగా రెండు రోజుల ఆస్పత్రి ఇన్ ఫెక్షన్, ప్రివెన్షన్, కంట్రోల్ ట్రైనింగ్ ప్రొగ్రామును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇన్ఫెక్షన్ రేటు అభివృద్ధి చెందిన దేశాల్లో 7 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10 శాతం ఉందని, రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటును తగ్గించడానికి 3 టైర్ సిస్టమ్ ను ప్రవేశపెట్టామన్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులో సూపరిండెంట్, మైక్రో బయాలజీ హెచ్ఒడి, నర్సింగ్ హెచ్ఒడి ఉంటారని, ప్రతి సోమవారం మీటింగ్ పెట్టుకొని చర్చిస్తారన్నారు.

అదనంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ (డాక్టర్), ప్రత్యేకంగా స్టాఫ్ నర్స్ నియమించామని, వారికి ఈ రోజు శిక్షణ ఇస్తున్నామని, ముందు టీచింగ్ ఆస్పత్రి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, తర్వాత టివివిపి, పిహెచ్సి సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. మెడికల్ ఫీల్డ్ లో నిరంతరం నేర్చుకున్నప్పుడే మెరుగైన వైద్యం అందుతుందని, ఈ శిక్షణను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలని నిర్ణయించామన్నారు.

థియేటర్లు, ప్రసూతి గదులు, డయాలసిస్ వార్డుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, దాన్ని అరికట్టాలంటే అంతే జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, అక్కడ ఉండే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలని, ఇన్ఫెక్షన్ వస్తే మీరు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సూపరింటెండెంట్ ల దగ్గర భారీగా నిధులు ఉన్నాయని, కావల్సిన పరికరాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

మనం కార్పొరేట్ హాస్పిటల్ కన్నా తక్కువ కాదని, రూ. 20 కోట్లతో ఎక్విప్మెంట్ మేనేజిమెంట్ పాలసీ తీసుకొచ్చి ఫోన్ కాల్ లేదా మెయిల్ చేస్తే మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రూ. 30 కోట్లతో మార్చురీలను అధునికరిస్తున్నామని, 56 హై ఎండ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు తెప్పిస్తున్నామని వివరించారు. రాబోయే 10 రోజుల్లో పిహెచ్ సి ల్లో 1000 మంది డాక్టర్లను నియమిస్తున్నామని, 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని హరీష్ రావు వెల్లడించారు.

మరో 140 మంది మిడ్ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తారని, నిపుణులైన సిబ్బంది ఉన్నారని, పరికరాలు ఉన్నాయని, శిక్షణ ఇస్తున్నాం కాబట్టి కార్పొరేట్ కన్నా ప్రభుత్వ ఆస్పత్రులు తక్కువ కాదన్నారు. అంతిమంగా కావాల్సింది అత్యుత్తమ సేవలు అని, పేదల సంతృప్తి మాకు ముఖ్యమని చెప్పారు. వారు సంతోషంగా వైద్యం పొందాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు సేవ చేయడంలో అద్భుతమైన సంతృప్తి దొరుకుతుందని, రాష్ట్రంలో ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గిందని, ఎంఎంఆర్ లో తమిళనాడును దాటి 2వ స్థానంలో ఉన్నామని, ఈ సారి ఇంకా మెరుగుఅవుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు వల్ల ప్రమోషన్స్ వేగంగా వస్తున్నాయని, ఆ పాజిటివ్ ఎనర్జీని రోగుల కోసం వాడాలని సూచించారు. ఇదే సమయంలో తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటును 7 శాతం కన్నా తక్కువ తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని, అనంతరం మంత్రి ఇఎండి వార్డు సందర్శించారని, అందుతున్న వైద్య సేవల గురించి రోగులతో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News