Tuesday, January 21, 2025

రాజస్థాన్‌లో ఇంటి పై కూలిన మిగ్: ముగ్గురు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో భారతీయ వాయుసేనకు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో విమానం అదుపు తప్పి డబ్లీ ప్రాంతంలోని బహ్లోల్ నగర్‌లో కింద ఉన్న ఇంటిపై కూలడంతో ఇంటికి నిప్పంటుకుంది. ముగ్గురు మహిళలు పూర్తిగా కాలిపోయి మృతి చెందగా, కొందరికి గాయాలు అయ్యాయి. ఘటనలో ఈ యుద్ధ విమాన పైలట్ సమయస్ఫూర్తితో తప్పించుకున్నారు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని వెల్లడైంది. ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గంగానగర్ జిల్లాలోని సూరత్‌గఢ్‌లో ఉన్న ఐఎఎఫ్ స్థావరం నుంచి రోజువారి పైలెట్ శిక్షణా విన్యాసాలలో భాగంగా మిగ్ గాలిలోకి ఎగిరిన దశలో ప్రమాదం జరిగింది.

అత్యయిక పరిస్థితి తలెత్తడంతో పైలట్ చాలా సేపటివరకూ దీనిని అదుపులోతెచ్చేందుకు యత్నించాడు. కానీ వీలు కాలేదు. దీనితో ఆయన కిందికి పారాచూట్ సాయంతో కిందికి దూకడం , ఈలోగా కంట్రోలులో లేని ఈ యుద్ధ విమానం పిడుగులా వెళ్లి కింద ఉన్న నివాసిత ప్రాంతాలలోని ఇంటిపై పడింది. స్థానిక రత్తిరామ్ ఇంటిపై ఈ దుర్ఘటన జరగడంతో ఇంటిలోని ఆయన భార్య బాషో కౌర్, మరో ఇద్దరు మహిళలు చనిపోయారు. వీరిని లీలాదేవి, బంటో కౌర్‌లుగా గుర్తించారు. తీవ్రగాయాలతో వారు చనిపోయినట్లు వెల్లడైంది. విమానం ధాటికి రత్తిరామ్ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పైలట్ తీవ్రగాయాలతో సూరత్‌గఢ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో పడి ఉండగా గుర్తించారు.

జరిగిన ఘటనపై భారతీయ వాయుసేన విచారం వ్యక్తం చేసింది. పౌరుల ప్రాణాలు పోవడం బాధాకరం అని , బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామని , ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించామని బికనెర్ రేంజ్ ఐజి ఓమ్ ప్రకాశ్ ఓ ప్రకటన వెలువరించారు. ప్రాణనష్టం జరగకుండా పైలట్ పలు విధాలుగా యత్నించాడని అయితే కుదరలేదని వివరించారు. ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయ్యారని , ఇది అత్యంత బాధాకరమైన విషయం అని తెలిపారు.
భారీ శబ్ధం గాల్లో పారాచూట్‌తో ఓ వ్యక్తి.. స్థానికుడి ప్రత్యక్ష అనుభవం
తాను ఉదయం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆకాశంలో పెద్ద చప్పుడు విన్పించిందని, ఎవరో విమానం నుంచి కిందికి దూకడం చూశానని ,కనురెప్పపాటులోనే కింద ఉన్న ఇంటిపై విమానం పడిందని స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు. విమానం పడగానే ఇల్లు తగులబడిందన్నారు. చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి మంటలు ఆర్పేందుకు యత్నించారు.అగ్నిమాపక శకటాలు తరలివచ్చాయి. కాలిన స్థితిలో ఉన్న మహిళలను ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇంటిలో నిల్వ ఉంచిన కట్టెలు ఇతర సామాగ్రికి మంటలు అంటుకోవడం వల్ల మహిళలు బయటకు రాలేకపోయినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News