నిర్మాణంలో ఉన్న భవనంలో దుర్ఘటన
ముంబయి : ముంబయి బోరివలి శివారు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో ఒక పరంజాలో కొంత భాగం మంగళవారం కూలిపోయినప్పుడు ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సోని వాడి ప్రాంతంలోని కల్పనా చావ్లా చౌక్‌లో మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు ఈ దుర్ఘటన సంభవించినట్లు వారు తెలిపారు.
‘నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల భవనంలో 16వ అంతస్తు నుంచి పరంజా కూలిపడినప్పుడు నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిని కాండివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నాలుగవ బాధితుని పరిస్థితి విషమంగా ఉంది’ అని మునిసిపల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనపై సమాచారం అందగానే రెండు ఫైరింజన్లను నగర అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ సిబ్బందితో పాటు పంపినట్లు ఆయన తెలిపారు.