భవనంపై నుంచి బాలుడిని తోసివేసిన పిన్ని
చిన్నారి ప్రాణం తీసిన ఈర్ష
మన తెలంగాణ/చార్మినార్: పిల్లాడిపై ఈర్షతో సొంత పిన్నే భవనం నుంచి బాలుడిని నెట్టివేసిన విషాద సంఘటన పాతబస్తీ భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఈదిబజార్ కుమ్మర్‌వాడికి చెందిన మహ్మద్ ఏతేషాముద్దీన్, నుజావుద్దీన్లు అన్నదమ్ములు. సుజావుద్దీన్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా కొన్నేళ్ల క్రితం సుజావుద్దీన్ అయేషాబాను వివాహం జరిగింది. వీరికి పిల్లలు కలగలేదు. సుజావుద్దీన్ సోదరుడు మహ్మద్ ఏతేషాముద్దీన్, అస్మా సిద్ధికలకు మహ్మద్ నుమానుద్దీన్ (3) కుమారుడు ఉన్నాడు. నుమానుద్దీన్‌ను కుటుంబ సభ్యులందరూ బాగా ముద్దు చేస్తుంటారు.
అదేవిధంగా తమ్ముడి కుమారుడిని సుజావుద్దీన్ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. దీంతో నుజావుద్దీన్ భార్య ఆయేషాబాను బాలుడిపై ఈర్ష పడేది. ఆ బాలుడిని ఎలాగైనా హత్య చేయాలని అనేకసార్లు కుట్ర పన్నింది. దీనిలో భాగంగానే ఇంట్లోని కరెంటు తీగలు తెరచి ఉంచటం, బాలుడి చేతులను తలుపుల మధ్య పెట్టటం వంటి ఘటనలకు గతంలో పాల్పడింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మందలించి పుట్టింటికి పంపించారు. గతకొన్ని రోజుల కిందటే పెద్దలు సర్ధిచెప్పటంతో ఆయేషాబాను తిరిగి మెట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం మహ్మద్ నుమానుద్దీన్ రెండవ అంతస్తు భవనంపై ఆడుకుంటుండగా అక్కడి నుంచి తోసివేసింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
3 years old boy thrown down from 2nd floor in Old City