Thursday, January 30, 2025

మహా విషాదం

- Advertisement -
- Advertisement -

అర్ధరాత్రి 12గంటల మధ్య దుర్ఘటన పవిత్ర మౌని అమావాస్య ముహూర్త సమయంలో త్రివేణి సంగమం వద్ద స్నానాల
కోసం ఎగబడిన భక్తులు జనం వత్తిడి పెరగడంతో విరిగిపోయిన బారికేడ్లు వృద్ధులు, మహిళలు, చిన్నారులకు తీవ్ర
గాయాలు ఘటనా స్థలిలో చెల్లాచెదరుగా పడిపోయిన చెప్పులు, వస్త్రాలు, బ్యాగులు తొక్కిసలాట ఘటనతో అమృత్
స్నాన్‌ను నిలిపివేసిన అఖాడాలు.. మధ్యాహ్నం తరువాత పునరుద్ధరణ వివరాల కోసం 1920 హెల్ప్‌లైన్ ఏర్పాటు
మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామన్న మహా కుంభ్ డిఐజి వైష్ణవ్ కృష్ణ బుధవారం కుంభమేళాకు విఐపిలు ఎవరినీ
అనుమతించలేదు మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.2లక్షలు ఆర్థిక సాయాన్ని
ప్రకటించిన యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ న్యాయవిచారణకు ఆదేశించిన యుపి ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది
ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్

మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారు జామున భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం, బుధవారం మద్య రాత్రి 1.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మౌని అమావాస్య నాడు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమం లోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయనేది భక్తుల విశ్వాసం. ఈ సమయంలో పుణ్యస్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందనే నమ్మకంతో బుధవారం కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్లగా కొందరు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు.

దాంతో అవి విరిగిపోయాయి. ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంట తెచ్చుకున్న బ్యాగులు, లగేజీలతో పరుగెత్తలేక కొంతమంది కింద పడిపోయారు. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒకానొక దశలో అంబులెన్స్‌కు కూడా దారి లేని పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని అంబులెన్స్‌కు మార్గం చూపారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితులు అదుపు లోకి వచ్చినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం విపరీతంగానే ఉంది. ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించగా, ఇంకా కోట్ల మంది వేచి చూస్తున్నారు.

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్యసాయంపై ఆరా తీసినట్టు ప్రదాని వెల్లడించారు. తొక్కిసలాట సంఘటన బాధాకరమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని , క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ‘ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా లో చోటుచేసుకున్న విషాదం తీవ్ర విచారకరం.

ఈ సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సాయం చేస్తోంది. దీని గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోనూ మాట్లాడా. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా ’ అని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సిఎం ఆదితన్యనాథ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొక్కిసలాటలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. అయితే మరణాల గురించి యూపీ ప్రభుత్వం ఇంకా ఏం చెప్పలేదు.

భయాందోళనలు చెందవద్దు : ప్రత్యేకాధికారి విజ్ఞప్తి
ఈ సంఘటన గురించి కుంభమేళా అధారిటీ ప్రత్యేక కార్యనిర్వాహక అధికారి ఆకాంక్ష రాణా మాట్లాడుతూ సంగం ముఖద్వారం వద్ద అడ్డంకి విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారని చెప్పారు. గాయపడిన కొంతమంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన పరిస్థితి కాదని, భయాందోళనలు చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. భక్తుల రద్దీని తరలించడానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో జగద్గురు రాంభద్రాచార్య భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. గంగానదికి సమీపం లోని ఏ ఘాట్‌లోనైనా పవిత్ర స్నానం చేయాలని, సంగం వద్ద మాత్రమే స్నానం చేయాలని అనుకోరాదన్నారు. గంగానదిపై నిర్మించిన ఏ ఘాట్‌లోనైనా స్నానం చేయవచ్చని, నది ప్రతిచోటా ఒకేలా ఉంటుందన్నారు. మేళా మొత్తం సంగం వలె పవిత్రమైందని వెల్లడించారు.

ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే ప్రత్యేక రైళ్లు నిలిపివేత
తొక్కిసలాట జరిగిన తరువాత దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి ప్రయాగ్ రాజ్ కు వెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను నిలిపివేసినట్టు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు. అధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సాధారణ రైళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పుణ్యస్నానాలు ఆచరి ంచడానికి త్రివేణి సంగమం ఘాట్‌కు భక్తులు వస్తున్న వాహనాలు, బస్సులను ప్రయాగ్‌రాజ్ సరిహద్దుల్లో 24 గంటల పాటు నిలిపివేశామన్నారు. కుంభమేళా ప్రాంతంలో ఇప్పటికే పదికోట్లు మంది ప్రజలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తుండటంతో 24 గంటల పాటు ఇతరులను అనుమతించట్లేదని జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర పేర్కొన్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్‌కు వస్తున్న రైలు సదుపాయాలను ఆపివేయలేదని భారతీయ రైల్వేఅధికారులు తెలిపారు. ప్రయాగ్ రాజ్ నుంచి భక్తులను తిరిగి తీసుకెళ్లేందుకు అదనంగా దాదాపు 360 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. రైల్వేస్టేషన్‌లో రద్దీని ఎప్పటికప్పుడు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షులు
తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మీడియాతో పంచుకున్నారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళం నెలకొందని, చీకట్లో కనిపించని చెత్తబుట్టలు కాళ్లకు తగలడంతో చాలా మంది కింద పడిపోయారని ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. .చెత్త బబ్బా తగిలి తాను కూడా కింద పడిపోయానని , ఎలాగోలా అక్కడ నుంచి కుటుంబంతో బయటపడ్డానని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ వివేక్ మిశ్రా తెలిపారు. వేరే భక్తులను కాపాడే క్రమంలో స్వల్పంగా గాయపడినట్టు వివరించారు. ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. దానివల్లనే పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని మరో ప్రత్యక్షసాక్షి రామ్‌సింగ్ చెప్పారు. చాలా మంది మా కళ్ల ముందే కింద పడిపోయారని ఆయన పేర్కొన్నారు.

విపక్షాల విమర్శలు
పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా వీఐపీల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ మహా కుంభమేళాలో తొక్కిసలాట సంఘటనలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం , గాయాల పాలవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. పాలనాయంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా , వీఐపీల తరలింపుపై ఎక్కువ దృష్టి పెట్టడమే ఈ విషాద సంఘటనకు కారణం. ఈ మహాకుంభమేళాలో మహాస్నానాలు ఇంకా అనేకం జరగాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థను మెరుగుపరచాలి. వీఐపీ సంసృతిని అరికట్టి , సామాన్యభక్తులకు ప్రాధాన్యమివ్వాలి’ అని రాహుల్ రాసుకొచ్చారు.

అరకొర ఏర్పాట్లే ఈ ప్రమాదానికి కారణమని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా ఆరోపించారు. రూ. వేల కోట్లు ఖర్చు పెట్టినా ఏర్పాట్లు అంతంత మాత్రంగా ఉండటం శోచనీయమన్నారు. భక్తుల సౌకర్యాలకంటే స్వీయ ప్రచారం పైనే ఎక్కువ దృష్టి పెట్టారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మేలుకొని సాధారణ భక్తులకు మౌలిక వసతులు కల్పించి, వీఐపీల రాకపోకలను నియంత్రించాలన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. దీని నిర్వహణ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. నిర్వహణ లోపమే ఈ సంఘటనకు కారణమన్నారు. కుంభమేళా నిర్వహణను సైన్యానికి అప్పగించాలన్నారు. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ యోగి రాజీనామా చేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

సాధువులు, యోగులపై హెలికాప్టర్లతో పూలవర్షం
మౌని అమావాస్య సందర్భంగా పుణ్య తిథిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో యోగులు, సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వారిపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ దృశ్యాలు వీడియోల్లో వైరల్ అయ్యాయి. నాగ సాధువులు ఈరోజు రెండోసారి పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉండగా, తెల్లవారు జామున తొక్కిసలాట కారణంగా అమృతస్నానాన్ని రద్దు చేసుకున్నారు. ఉదయం 10 గంటల తరువాతనే రద్దీ తగ్గిన తరువాత పవిత్ర స్నానం ఆచరించడానికి సిద్దమయ్యారు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది మరణించడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నది. గాయపడిన 100మందిలో 36 మంది ప్రయాగ్ రాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మేళా నిర్వాహక అధారిటీ, పోలీసులు, ఎన్ డిఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు నిర్విరామంగా పటిస్టమైన ఏర్పాట్లు చేసినా ఈ దుర్ఖటన జరగడం కలచివేసింది. దురదృష్టకరమైన ఈ సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాం.
యోగి ఆధిత్యనాథ్, యుపి సిఎం

‘ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా లో చోటుచేసుకున్న విషాదం తీవ్ర విచారకరం. ఈ సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సాయం చేస్తోంది. దీని గురించి యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడా. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా.. పాలనాయంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా, వీఐపీల తరలింపుపై ఎక్కువ దృష్టి పెట్టడమే ఈ విషాద సంఘటనకు కారణం. ఈ మహాకుంభమేళాలో మహాస్నానాలు ఇంకా అనేకం జరగాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థను మెరుగుపరచాలి. వీఐపీ సంస్కృతిని అరికట్టి సామాన్యభక్తులకు ప్రాధాన్యమివ్వాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News