Saturday, November 23, 2024

రోజూ 30 నిమిషాలు నడిస్తే క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు

- Advertisement -
- Advertisement -

రోజుకు 30 నిమిషాల సేపు నడిచినా, యోగాభ్యాసాలు చేసినా క్యాన్సర్ రోగుల్లో చాలావరకు అలసట లేదా ఆయాసం తగ్గించడమేకాక, వ్యాధి వ్యాప్తి , మరణించే ముప్పు కూడా తగ్గుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలో ఏటా 18 మిలియన్ కన్నా ఎక్కువ మంది క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు. క్రియారహితంగా ఉంటే ఈ వ్యాధి వివిధ రకాలుగా మరింత పెరుగుతుందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన క్యాన్సర్ పరిశోధకులు క్యాన్సర్ వ్యాధిని గుర్తించిన తరువాత చురుకుగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకొంటున్నారు.

కొన్ని దశాబ్దాలుగా ఆంకాలజిస్టులు చాలా మంది, వైద్యులు క్యాన్సర్ రోగులకు కఠినమైన చికిత్సలు చేస్తుండే సమయంలో వారిని వ్యాయామానికి కానీ, లేదా మరేదైనా శారీరక శ్రమకు కానీ ఒప్పుకొనే వారు కాదు. కానీ ఇప్పుడు తరం మారింది. ప్రపంచ స్థాయి క్యాన్సర్ సదస్సు అయిన అమెరికా సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ఎఎస్‌సిఒ) వార్షిక సమావేశంలో మూడు అధ్యయనాలు సమర్పించడమైంది. శారీరక చురుకుదనం క్యాన్సర్ రోగులకు ప్రయోజనం కలిగిస్తుందని స్పష్టం చేశాయి. రోగులు వ్యాయామం చేయడం మంచిదన్న అభిప్రాయం చాలా మంది వైద్యుల్లో వెలువడింది. మొదటి అధ్యయనంలో రోగులను గ్రూపుల వారీగా విభజించి రోగుల్లోని ఇన్‌ఫ్లెమేషన్ (వాపు)పై యోగా ప్రభావం ఏవిధంగా ఉంటుందో పరిశీలించారు.

క్యాన్సర్ అభివృద్ధిలో ఇన్‌ఫ్లెమేషన్ కీలక పాత్ర వహిస్తుంది. ట్యూమర్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ అధ్యయనంలో అమెరికా మొత్తం మీద సరాసరి 56 ఏళ్లు వయసున్న 500 మంది కన్నా ఎక్కువ క్యాన్సర్ రోగులను తీసుకున్నారు. వీరంతా ఇదివరకే రెండు నెలల నుంచి ఐదేళ్ల పాటు చికిత్స తీసుకున్నవారే. వీరందరికీ రక్త పరీక్షలు చేశారు. యోగా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వారిలో ఇన్‌ఫ్లెమేషన్ చిహ్నాలు చాలా తక్కువగా కనిపించాయి. దీన్ని బట్టి యోగా వల్ల రోగుల్లో ఇన్‌ఫ్లెమేషన్ బాగా తగ్గిందని నిర్ధారణ అయినట్టు పరిశోధకులు తెలిపారు. అందువల్ల క్యాన్సర్ రోగులకు ఇన్‌ఫ్లెమేషన్ తగ్గాలంటే యోగా చేయడం తప్పనిసరి అని వైద్యులు రోగులకు సూచించవచ్చని పరిశోధకలు చెబుతున్నారు.

రెండో అధ్యయనంలో క్యాన్సర్ రోగుల్లో అలసట, లేదా ఆయాసంపై యోగా ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించారు. 60 ఏళ్లు పైబడిన 170 మంది క్యాన్సర్ రోగులను ఈ అధ్యయనంలో తీసుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. వీరు వారానికి రెండు సార్లు వంతున నాలుగు వారాల పాటు 75 నిమిషాల సేపు యోగా లేదా ఆరోగ్య విద్యా తరగతులలో పాల్గొన్నారు. ఫలితంగా వీరిలో అలసట లేదా ఆయాసం బాగా తగ్గింది. బ్రెజిల్ లోని ఇన్‌స్టిట్యూట్ డి మెడిసినా ఇంటెగ్రల్ ఆధ్వర్యంలో ఆరేళ్ల పాటు సాగిన పరిశోధనలో 2600 మంది క్యాన్సర్ రోగులను తీసుకున్నారు. వారివారి చురుకుదనం బట్టి ర్యాంకుల వారీ రోగులను విభజించారు.

వీరిలో యాక్టివ్ తరగతికి చెందిన రోగులు వారానికి ఐదు రోజుల పాటు 30 నిమిషాల సేపు నడక సాగించారు. నిశ్చలమైన అంటే ఎలాంటి కదలిక లేని జీవనశైలి కలిగిన వారిలో క్యాన్సర్ రిస్కు ఎక్కువ ఉన్నట్టు కనిపించింది. 180 రోజుల తరువాత ఎలాంటి కదలిక లేని 74 శాతం మందితో పోలిస్తే యాక్టివ్ గ్రూపు లోని వారిలో 90 శాతం మంది ఇంకా సజీవంగా ఉన్నట్టు తేలింది. కొన్ని గంటల పాటు కదలిక లేకుండా కూర్చోవడం, లేదా నిశ్చలంగా ఉండడం వంటివి ఉండకుండా మిగతా ఏ పనులైనా క్యాన్సర్ రోగులు చేయవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News