రోమ్ : ఇటలీ సముద్ర తీరంలో ఘోర విషాదం సంభవించింది. మధ్యధరా సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు లాంపేడుసా ద్వీపానికి సమీపాన బోల్తా పడి 30 మంది గల్లంతయ్యారు. 57 మందిని ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి. ట్యునీషియా లోని స్ఫాక్స్ నుంచి యూరప్‌కు బయలుదేరిన రెండు పడవల్లో ఒక దానిలో 48 మంది, మరో పడవలో 42 మంది వలసదారులు ఉన్నారు.
లాంపేడుసా ద్వీపానికి 23 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇటాలియన్ అధికారులు విచారణకు ఆదేశించారు. మరో ఘటనలో 20 మందితో కూడిన మరో పడవ గత శుక్రవారం నుంచి లాంపేడుసా ప్రాంతంలో రాళ్లను ఢీకొట్టడంతో కొండ ప్రాంతంలో ఇరుక్కుపోయిందని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. పడవలో ఉన్నవారిని రక్షించడానికి కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వెల్లడించాయి.