30% పెరిగిన అంగ్‌వాడీ టీచర్లు, సహాయ
సిబ్బంది వేతనాలు ఉపాధ్యాయుల వేతనం
రూ.10,500 నుంచి రూ.13,650కి పెంపు,
రూ.6వేల నుంచి రూ.7800కు చేరుకున్న సహాయ
సిబ్బంది జీతం, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్‌వాడి టీచర్లు, వారి సహాయ సిబ్బంది (మిని అంగన్‌వాడి టీచర్లు) వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడి ఉపాధ్యాయుల వేతనం నెలకు రూ. 10,500 నుంచి రూ. 13, 650లకు పెంచింది. అలాగే సహాయ సిబ్బందికి వేతనం నెలకు రూ.6వేల నుంచి రూ.7,800లకు పెంచింది. వీరి వేతనం పెంపు జూలై నుంచి వర్తింప చేస్తామని జీవోలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేతనాల పెంపుతో అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పల్లెలు, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలైన ఏజెన్సీల్లో గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడీల సేవలు చాలా అవసరం. ప్రధానంగా కొవిడ్ మొదటి, రెండో దశ సమయాల్లో అంగన్‌వాడీ వర్కర్లు విశేష సేవలందించారు. ఈ సేవలకుగానూ రాష్ట్రానికి చెందిన అంగన్ వాడీ కార్యకర్తలకు జాతీయ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే.