జిల్లా కేంద్రంలోని శర్మనగర్ మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. క్యాలీప్లవర్ కూరతో విద్యార్థినులకు పెట్టడంతో వారికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శర్మనగర్ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ గురుకులంలో 436 మంది విద్యార్థినులు ఉండగా 411 మందికి సోమవారం సాయంత్రం 6 గంటలకు క్యాలీప్లవర్ కూరతో భోజనం వడ్డించారు. రాత్రి 11 గంటల నుండి దాదాపు 30 మంది విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గా మారడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం విద్యార్థినులు కుదుటపడ్డారు.వారిని అబ్జర్వేషన్‌లో ఉంచామని, భయపడాల్సిన అవసరం లేదని అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. వారందర్నీ మంగళవారం ఉదయం డిశ్చార్జి చేశారు.
కాగా, ఫుడ్ పాయిజన్ గురించి తెలుసుకున్న అదనపు కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్, ఆర్‌డిఒ మహేశ్వర్, అదనపు డిఎంహెచ్‌వో సుజాత, అధికారులు హుటాహుటిన దవాఖానాకు వచ్చి విద్యార్థినులు, వైద్యులతో మాట్లాడారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, ఏబివిపి సంఘాల ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. అక్కడ ఉన్న పోలీసులు, విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆర్‌సిఓ, ప్రిన్సిపాల్, వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ..ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపించి బాధ్యలపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థినులు అంతా క్షేమంగా ఉన్నారని, తాను వారితో మాట్లాడినట్లు తెలిపారు. విద్యార్థినులకు సిక్‌లీవులు ఇవ్వడంతో వారిని తల్లిదండ్రులతో ఇంటికి పంపారు.
జిల్లా కలెక్టర్‌కు కేంద్రమంత్రి బండి ఫోన్:
కరీంనగర్‌లోని శర్మనగర్ మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరా తీశారు. ఢిల్లీ నుండి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసిన కేంద్రమంత్రికి క్యాబేజీ కూర తినడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో భోజనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. శుభ్రత, నాణ్యత విషయంలో రాజీపడొద్దని బండి సంజయ్‌కుమార్ అన్నారు. సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు విద్యార్థులను పరామర్శించారు.
విద్యార్థులను పరామర్శించిన సుడా ఛైర్మన్
నగరంలోని జ్యోతిబాపూలే బిసి గర్ల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న సుడా ఛైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ మహమ్మద్ తాజోద్దీన్, కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు చెందిన విద్యార్థులను ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు, బిసి, యువజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు.