తెలంగాణ యువత కోసం మంత్రి శ్రీధర్ బాబు చొరవ
‘బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్’ పేరిట ప్రత్యేక కోర్సు
ఏటా10వేల మంది బీటెక్, డిగ్రీ పట్టభద్రులకు శిక్షణ
హైదరాబాద్‌లో అర్హత పరీక్షకు హాజరైన విద్యార్ధులు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బీటెక్ పట్టభద్రులకు ప్రారంభించిన ‘బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్’ కోర్సుకు విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన అర్హత పరీక్షకు విద్యార్ధులు హజరయ్యారు. వీరిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై వరకు బ్యాంకింగ్ ఆప్రేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్ వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబ్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తారు. అనంతరం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ)కు సంబంధించిన హైదరాబాద్ లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ప్లేస్ మెంట్స్ కల్పిస్తారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించి, తెలంగాణను నైపుణ్యం కలిగిన మానవ వనరులకు చిరునామాగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి సంక్పలించారు.
అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల అవసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ అందుకు అనుగుణంగా కొత్త కోర్సులను తెలంగాణ యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. అనుకూలమైన వాతావరణం ఉండటంతో హైదరాబాద్ లో జీసీసీలను ప్రారంభించేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల సంఖ్య పెరుగుతోంది. వీటిల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబు సంకల్పించారు. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో అనుభవమున్న దేశీయ, యూఎస్‌ఏ, సింగపూర్ నిపుణులు, జీసీసీల నిర్వాహకులను సంప్రదించారు. వారి సూచనలు సలహాలతో ‘బీఎఫ్‌ఎస్‌ఐ -స్కిల్లింగ్’ పేరిట ప్రత్యేక కోర్సును స్కిల్ యూనివర్సిటీలో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఏటా 10వేల మందికి శిక్షణ ఇస్తారు.
\వీరిలో 5వేల మంది ఇంజినీరింగ్, మరో 5వేల మంది డిగ్రీ పట్టభద్రులుంటారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీల్లో ఉద్యోగాలు ఇస్తారు. అంటే రానున్న మూడేళ్లలో 30వేల మంది తెలంగాణ యువతకు ఈ కోర్సు ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గతేడాది సెప్టెంబర్ లో మొదటి బ్యాచ్ ప్రారంభమయ్యింది. దీని నిర్వహణకయ్యే ఖర్చును ఎక్విప్ , బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్షియం భరిస్తుంది. విద్యార్థులు స్వల్ప అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. సర్టిఫికేట్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం అభ్యర్థుల నుంచి ఒక్కసారి రూ.5వేలు వసూలు చేస్తారు. ఇప్పటికే రెండు బ్యాచ్ లను విజయవంతంగా పూర్తి చేసినట్లు కోర్సు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ కోసం అర్హత పరీక్షలను నిర్వహించారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పట్టభద్రులు స్కిల్స్ యూనివర్సిటీ వెబ్ సైట్( yisu.in )ను తరచూ సంప్రదించాలని కోరారు.