ఎటు చూసినా శవాల గుట్టలే!
కీవ్ సమీప బుచ్చా పట్టణంలో హృదయవిదారక దృశ్యాలు
300 మందిని సామూహిక సమాధిలో పూడ్చిపెట్టిన వైనం
వీధుల్లోనూ సాధారణ పౌరుల మృతదేహాలు
రష్యా ఉద్దేశపూర్వకంగా చేసిన మారణ కాండ ఇది: ఉక్రెయిన్
యుద్ధ నేరాల కింద విచారణ జరపాలని బ్రిటన్, జర్మనీ డిమాండ్
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీప నగరాల నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాలను ఉక్రెయిన్ ఆర్మీ తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. అయితే, ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైన కీవ్ సమీపంలోని బుచ్చా నగరంలో సుమారు 300మందిని పూడ్చిపెట్టిన సామూహిక సమాధిని కనుగొన్నట్లు మేయర్ అనటోలి ఫెడోరుక్ చెప్పారు. వీరిని తలవెనుక కాల్పులు జరిపి చంపేశారని ఆయన ఆరోపించారు. అలాగే రోడ్లపైన, పలు చోట్ల సాధారణ దుస్తుల్లో ఉండి చనిపోయిన సుమారు 20 మంది మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపారు. ఒక రోజు ముందు ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఎపి వార్తాసంస్థ జర్నలిస్టులు కూడా సాధారణ దుస్తుల్లో ఉన్న కనీసం 9 మంది మృతదేహాలను తాము చూసినట్లు చెబుతున్నారు. దాదాపు 35 వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో జరిగిన మారణ కాండపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుచ్చాలో పౌరులపై రష్యా సేనలు జరిపిన మారణ హోమాలు ఉద్దేశపూర్వకంగా జరిపినవేనని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. ‘వీలయినంత ఎక్కువ మంది ఉక్రెయిన్లను తుడిచిబెట్టాలని రష్యన్ బలగాలు లక్షంగా పెట్టుకున్నాయి. వారి ఆగడాలను అడ్డుకోవాలి, వారిని తరిమి కొట్టాలి’ అని ట్వీట్ చేశారు. కీవ్ ప్రాంతాన్ని 21వ శతాబ్దపు నరకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖెలో పోడోల్యాక్ అభివర్ణించారు. నాజీ నాటి దారుణ నేరాలు రష్యాకు తిరిగి వచ్చాయని విమర్శించారు. ఇదంతా రష్యా ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు. వెంటనే రష్యాపై ప్రపంచ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
యుద్ధ నేరాలుగా పరిగణించాలి: బ్రిటన్, జర్మనీ
రష్యన్ దళాలు వెనక్కి వెళ్తున్న క్రమంలో పౌరులపై దురాగతాలు సాగించారన్న ఆరోపణలపై యుద్ధ నేరాల కింద విచారణ చేయాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు బ్రిటన్ పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు. ఉక్రెయిన్‌లోని బుచ్చా పట్టణంలో దారుణమైన యుద్ధ నేరం జరిగిందని జర్మనీ వైస్ చాన్సలర్, ఆర్థిక మంత్రి రాబర్ట్ హబెక్ అన్నారు. ఈ క్రమంలోనే రష్యాపై మరిన్ని ఇయు ఆంక్షలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధ నేరానికి రష్యా సమాధానమిచ్చి తీరాల్సిందేనని రాబర్ట్ హబెక్ ఓ జర్మన్ వార్తాపత్రికతో అన్నారు. కాగా, బుచ్చాలో రష్యా సైన్యాలు సాగించిన మారణ కాండను యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ తీవ్రంగా ఖండించారు.‘బుచ్చాలో రష్యాసైన్యం జరిపిన దురాగతాల చిత్రాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యా’నని ఆయన ఓ ట్వీట్ చేశారు. రష్యాపై ఇయు మరిన్ని ఆంక్షలు విధిస్తుందని తెలిపారు.
ఒడెసా, మైకొలోవ్‌పై క్షిపణి దాడులు
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెసాపై ఆదివారం తెల్లవారుజామున రష్యా బలగాలు వైమానిక దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఓ చమురు శుద్ధి కర్మాగారం, మూడు ఇంధన డిపోలను తెక్షిపణులు ధ్వసం చేశాయని రష్యా రక్షణ శాఖ ప్రకటించిందని ఓ వార్తాసంస్థ తెలిపింది. మైకొలోవ్ నగరానికి సమీపంలోని తమ బలగాలకు ఇంధనం సరఫరా చేసేందుకు ఉక్రెయిన్ ఈ సౌకర్యాలను ఉపయోగిస్తోందని తెలిపింది. అయితే రష్యా క్షిపణుల్లో కొన్నిటిని తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసిందని ఉక్రెయిన్ మిలిటరీ ప్రతినిధి తెలిపారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపారు. మరో పోర్టు సిటీ మైకొలోవ్‌పైన కూడా రష్యా క్షిపణి దాడులు జరిపినట్లు స్థానిక మేయర్ ఒలెక్సాండర్ సెన్‌కెవిచ్ తెలిపారు. మైకొలేవ్ నౌకాశ్రయంపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అంతర్గత శాఖ ప్రతినిధి ఆంటోన్ గెరాష్చెంకో కూడా ధ్రువీకరించారు.
11 మంది స్థానిక మేయర్ల కిడ్నాప్
ఉక్రెయిన్‌లోని కీవ్, ఖెర్సన్, కార్ఖివ్, మైకలోవ్, డొనెట్స్ తదితర ప్రాంతాలకు చెందిన 11మంది స్థానిక మేయర్లు రష్యన్ బలగాల చెరలో ఉన్నట్లు ఉక్రెయిన్ ఉపప్రధాని ఇరినా వెరెష్‌చుక్ ఆదివారం ఆరోపించారు. నిర్బంధంలో ఉన్న కీవ్ ప్రాంతంలోని మోతిజిన్ మేయర్ ఓల్గా సుఖెంకోను కాల్చి చంపినట్లు తమకు తెలిసిందని ఆమె చెప్పారు. దీనిపై ఐరాస, రెడ్‌క్రాస్ తదితర సంస్థలకు తెలియజేస్తామని ఆమె చెప్పారు. వారిని విడిపించడానికి ప్రతి ఒక్కరూ అన్ని విధాలా ప్రయత్నించాలని ఆమె కోరారు.
300 buried in mass grave in Bucha near Kyiv