తిరువనంతపురం: కేరళలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 300 కొవిడ్-19 కొత్త కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా మూడు మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన 358 కొవిడ్ కేసులలో 300 కేసులు కేరళ నుంచే వచ్చాయని, దీంతో కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,341కు పెరిగిందని వెబ్‌సైట్ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా మూడు మరణాలు చోటుచేసుకోవడంతో మూడేళ్ల క్రితం కొవిడ్ ప్రబలినప్పటి నుంచి ఇప్పటి వరకు కేరళలో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 72,059కి చేరుకుంది.
గడచిన 24 గంటలలో 211 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారులేదా డిశ్చార్జ్ అయ్యారని వెబ్ సైట్ పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 68,37,414 మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. కాగా..కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి మంగళవారం ఒక ప్రకటనలో కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. వైరస్‌ను ఎదుర్కొనడానికి ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు.