న్యూఢిల్లీ : దేశంలో 2018 నుంచి ఇప్పటివరకూ 30,310 వెబ్ లింక్స్‌పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. సోషల్ మీడియా లింక్‌లు, సోషల్ మీడియా అకౌంట్లు, ఛానల్స్, పేజీలు, యాప్‌లు, వెబ్‌పేజిలు, వెబ్‌సైట్స్ వంటివాటిపై కేంద్రం ఈ నిషేధం విధించింది. వీటిని బ్లాక్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల లోక్‌సభకు తెలిపింది. ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత వివరాలను సభ ముందుంచారు. ఐటి నిబంధనల పరిధిలో ఏర్పాటు అయిన ఓ కమిటీ పలు విధాలుగా ఈ వెబ్ అనుసంధాన ప్రక్రియలపై పరిశీలన జరిపిందని తెలిపారు. మొత్తం మీద 41,172 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ (యూఆర్‌ఎల్)లపై పరిశీలన జరిగిందని, ఇందులో ఇప్పటివరకూ 30 వేలకు పైగా సోషల్ లింక్స్‌పై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్రాల నుంచి సంబంధిత సోషల్ లింక్స్‌పై సమాచారం అందిందని, వీటిని ఐటి యాక్ట్ 2000 69 ఎ సెక్షన్ పరిధిలో నిషేధించాల్సి ఉందని తెలిపారని మంత్రి సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో జరిగిన ప్రక్రియ మేరకు 2018 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకూ 30వేలకు పైగా ఈ వెబ్ లింక్స్‌పై చర్యకు దిగినట్లు మంత్రి తెలిపారు. సంబంధిత ఐటి చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఇటువంటి వెబ్ లింక్స్‌పై తగు చర్యలు తీసుకునే అధికారం ఉందని వివరించారు. అవసరం అయితే ఆయా లింక్స్ ఎటువంటి సమాచార వినిమయ ప్రక్రియకు వీల్లేకుండా చేసుకునే వీలుంటుందని, ఈ అధికార పరిధిలోనే ఈ చర్యలు తీసుకున్నారని చెప్పారు. భారతదేశ భద్రత రక్షణ, సార్వభౌమాధికారం పరిధిలో , ఇక్కడి ప్రభుత్వ క్షేమం , విదేశీ ప్రభుత్వాలతో సముచిత స్నేహ సంబంధాల దిశలో ఇటువంటి ఆంక్షలకు వీలేర్పడుతుందని చెప్పారు. తప్పుడు చర్యలకు దిగే సోషల్ లింక్స్‌పై శిక్షార్హ నేరాభియోగాలను మోపేందుకు కూడా సాధ్యం అవుతుందని, ఇప్పటి నిషేధ ప్రక్రియ అంతా ఐటి చట్టం పరిధిలో సవ్యంగానే జరిగిందని మంత్రి తెలిపారు.