Saturday, November 23, 2024

కరోనా వల్ల 30వేల మంది చిన్నారులు అనాథలయ్యారు..

- Advertisement -
- Advertisement -

కొవిడ్ మహమ్మారి వల్ల 30 వేలమందికిపైగా అనాథలయ్యారు
274మంది అపహరణకు గురయ్యారు: సుప్రీంకోర్టుకు బాలల కమిషన్ నివేదిక

న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సిపిసిఆర్) తెలిపింది. రాష్ట్రాల వారీగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 5వరకు డేటాను సేకరించి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అనాథలుగా మారిన చిన్నారుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 30,071మందిలో 26,176మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోగా, 3621మంది ఇద్దరినీ కోల్పోయారని, 274మంది అపహరణకు గురయ్యారని ఎన్‌సిపిసిఆర్ పేర్కొన్నది. కొవిడ్ ప్రభావం మహారాష్ట్రపై అధికంగా చూపింది. ఆ రాష్ట్రంలో 7084మంది అనాథలుగా మారగా, వారిలో 6865మంది తల్లిదండ్రుల్లో ఒకరిని, 217మంది ఇద్దరినీ కోల్పోయారు. మరో ఇద్దరు అపహరణకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లో అపహరణకు గురైన చిన్నారుల సంఖ్య 226 అని నివేదిక వెల్లడించింది. రాష్ట్రాలవారీగా అనాథలైనవారు ఉత్తర్‌ప్రదేశ్‌లో 3172, రాజస్థాన్‌లో 2482, హర్యానాలో 2438, మధ్యప్రదేశ్‌లో 2243, ఆంధ్రప్రదేశ్‌లో 2089, కేరళలో 2002, బీహార్‌లో 1634, ఒడిషాలో 1073మంది ఉన్నారు.

దేశంలో అనాథలైనవారిలో 15,620మంది బాలురు కాగా, 14,447మంది బాలికలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని ఎన్‌సిపిసిఆర్ పేర్కొన్నది. వీరిలో 8-13 ఏళ్ల వయసువారు 11,815 మంది, 03 ఏళ్ల వయసువారు 2902 మంది, 47 ఏళ్ల వయసువారు 5107 మంది, 14-15 ఏళ్ల వయసువారు 4908 మంది, 16-18 ఏళ్ల వయసువారు 5339మంది ఉన్నారు. అనాథలుగా మారిన చిన్నారుల డేటాను బహిర్గతం చేయొద్దని రాష్ట్రాలను ఆదేశించినట్టు ఎన్‌సిపిసిఆర్ తెలిపింది. డేటా లీక్ చేయడం వల్ల అనాథలు అపహరణకు, చట్ట విరుద్ధ దత్తతకు గురయ్యే అవకాశమున్నదని తెలిపింది. జువెనైల్ జస్టిస్ ఫండ్ పేరుతో దాతల నుంచి విరాళాల సేకరణ కోసం బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్రాలను ఎన్‌సిపిసిఆర్ ఆదేశించింది.

30k Children orphaned by Covid 19 in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News