సర్కారు సహకరించినా.. కరుణించని బ్యాంకర్లు
పెరిగిన సాగు ఖర్చులు.. ఆపై అతివృష్టి పంటల రుణ పెంచాలని కోరుతున్న రైతులు సున్నా వడ్డీ పథకం
అమల్లో పెట్టాలని డిమాండ్ ససేమిరా అంటున్న బ్యాంకర్లు కాలం రూల్స్ వేధింపులు
రైతుబంధు వారిలో సగం మందికి దక్కని రుణాలు బ్యాంకు రుణాలకు దూరంగా 31లక్షల మంది
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రుణాలపై వత్తిడి పెరుగుతోంది. ఒకవైపు సేద్యపు ఖర్చులు మొదలుకొని పంటలకు కావాల్సిన విత్తనాల ధరలు, రసాయనిక ఎరువులు, క్రిమసంహారక మందుల ధరలు పెరిగిపోయాయి. వ్యవసాయ రేట్లు కూడా పెరిగాయి. పంటల సాగుకు సీజన్ ప్రారంభంలో వేసుకున్న పెట్టుబడి ఖర్చులకు , పొలంలో దిగి సాగు పనులు ప్రారంభించాక చేయాల్సి వస్తున్న ఖర్చులకు పొంతన కుదరటంలేదు. ఎకరం పొలం సాగుపైన పెట్టుబడి ఖర్చులు 20శాతం అదనంగా వస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వున్నారు. బ్యాంకర్లు పంటరుణాల మంజూరులో పెరిగిన సాగు ఖర్చులకు తగ్గట్టుగా రుణ పంపిణీ జరపాలని కోరుతున్నారు. సున్నా వడ్డీ పథకాన్ని అమల్లో పెట్టలాని విజ్ణప్తి చేస్తున్నారు. రైతుల విజ్ణప్తులకు బ్యాంకర్ల సమితి ఏమాత్రం స్పందించటం లేదని రైతుసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పంట రుణ పరిమితి పెంపులో కాలం చెల్లిన నిబంధనలు సాకుగా పెట్టుకుని రైతులను వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వస్తునాయి. రాష్ట్రం లో ఈ ఏడాది వానాకాలం సీజన్ కింద కోటి 40లక్షల ఎకరాల్లోపంటలు సాగు చేయించాలని ప్రభు త్వం ప్రాధమిక లక్ష్యాలు రూపొందించుకుంది.
సుమారు 68లక్షల మంది రైతులు వానాకాలం పంటల సాగులో నిమగ్నమయ్యారు. అందులో కూడా 75శాతంపైగా రైతులు సన్న చిన్నకారు రైతులే వున్నారు. పంటల సాగు ప్రారంభించాక ,పంటల సాగు రుణపరిమితికి క్షేత్ర స్ధాయిలో పంటల సాగు పెట్టుబడి ఖర్చులకు పొంతన కుదరటం లేదంటున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిలో నిర్ణయించిన వ్యవసాయ రుణ లక్ష్యాలే తక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా పంటల పెట్టుబడికి నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఏమూలకు సరిపోవడం లేదని రైతులు ఆందోళను చెందుతున్నారు. 2022-23లో వానాకాలం పం టల సాగుకింద రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి వ్యవసాయ రూ. 40,719 కోట్లు కేటాయించింది. ఈ మేరకు రుణాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకులకు రుణ పంపిణీ లక్ష్యాలు కూడా నిర్దేశించింది. బ్యాంకుల్లో ఇప్పటికే వ్యవసాయరుణాలు పొం దుతూ తిరిగి చెల్లిస్తూ బ్యాంకు లావాదేదిల్లో ఉన్న ఉన్న 33.85లక్షల మంది రైతులతోపాటు మరో 1.21లక్షల మంది కొత్త రైతులకు కూడా ఈ ఏడాడి పంటరుణాలు పొందేందుకు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో పట్టాదారు పాస్‌బుక్ పొంది వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్యతో పోలిస్తే బ్యాంకులు పంటరుణాలు ఇస్తున్న రైతుల సంఖ్య 50శాతం మించటం లేదు. రాష్ట్రంలో సుమారు 68.94లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పధకం కింద ప్రతిసీజన్‌లో ఎకరానికి రూ.5000పంటల పెట్టుబడి సాయం ఉచితంగా అందజేస్తోంది. ఈ వానాకాలం సీజన్‌లో రైతుబంధు పథకాన్ని నవీకరించి కొత్తగా 3.64లక్షల మంది రైతులకు ఈ పథకాన్ని వర్తింపచేసింది. వానాకాలం సీజన్‌కింద ఈ నెల మూడవ వారం నాటికే రూ.7654కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ రూ.58,102కోట్లు రైతులకు పంటల పెట్టుబడికి ఉచింతగా అందజేసింది.
తిరోగమనంలో బ్యాంకర్లు
అన్నిరంగాలకు వ్యవసాయ రంగమే మూలాధారం. ఇది గుర్తించే ముఖ్యమంత్రి కేసిర్ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పంటల సాగుకు రైతులను ప్రొత్సహిస్తున్నారు. రైతుబంధు , రైతు బీమా, ఉచిత విద్యు త్ వంటి పధకాలు అమలు చేస్తు వ్యవసాయరంగాన్ని పురోగమింపచేసేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు మూస ఉంటూ పాతవిధానాలను నవీకరించుకోలేపోతున్నారు. వ్యవసాయ రుణాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించటంలో బ్యాంకర్ల పాత్ర తిరోగమన చర్యలను తలపిస్తోందని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. బ్యాంకర్లు రుణ పంపిణీలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతన వ్యవసాయరంగానికి ఇవ్వటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్యరంగమైనా, పారిశ్రామిక రంగమైనా మరే రంగమైనా రైతులు పైర్లు వేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తేనే లక్షల మందికి ఉపాధి లభించి రూపాయి చేతులు మారుతుంది. ఇంతటి కీలక రంగానికి బ్యాంకర్లు మొక్కుబడి ప్రాధాన్యత ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
సగం మందికి దక్కని రుణాలు
రైతుబంధు పధకం పోందుతున్న రైతుల్లో సగం మందికి కూడా బ్యాంకుల ద్వారా రుణాలు అందటం లేదు. రైతుబంధు ద్వారా ఈ వానాకాలం 68.24లక్షల మంది లబ్దిపొందారు ,కొత్తరైతులు కూడా ఉన్నారు. అదే బ్యాంకుల ద్వారా పంటరుణాలకు సంబంధించి 33.85లక్షల మం దికి మాత్రమే రుణాలు అందజేస్తున్నారు. 31లక్షల మంది కి పైగా బ్యాంకు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి కల్పించారు. పంటరుణాలు 33.85లక్షల మందికి ఇస్తున్నట్టు పేరుకు రికార్డుల్లో తప్ప అందులో అధికశాతం రెన్యూవల్స్ , బుక్ అడ్జెస్ట్‌మెంట్లే అని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. రుణమాఫీకి లింకు పెట్టి వేల మంది రైతులపై డిఫాల్టర్ ముద్రలు కూడా వేశారు.
పట్టించుకోని బ్యాంకర్లు?
రాష్ట్రంలో రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రు ణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేశామని , బ్యాంకర్లు రైతులను వేధించకుండా కొత్త రుణాలు మంజూరు చేసి సహకరించాలని ముఖ్యమంత్రి కేసిర్ ఆసెంబ్లీ వేదికగా ప్రకటించారు. రైతులను డిఫాల్టర్లుగా ప్రకటించకుండా రెన్యూవల్ చేయాలని సూచించారు. సిఎం ప్రకటను బ్యాంకర్లు ఆచరణలో పెట్టకుండా రైతులను వేధింపులకు గురిచేస్తున్నట్టు రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.
రుణ పరిమితి విధానాలు మార్చండి
బ్యాంకర్ల సమితి వ్యవసాయ రుణాలకు సంబంధించి ఇ ప్పుడున్న విధానాలను పూర్తిగా మార్చాలని రైతులు , రైతుసంఘాల నేతలు కోరుతున్నారు. పంటరుణాల పంపిణీ మరింత సరళతరం చేయాలని సూచిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పంటల సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించాలని కోరుతున్నారు. అంతే కాకుండా సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు సున్నా వడ్డీరాయితీని అమలు చేయాలంటున్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా భూము ల ధరలు ఏటా పెంచూతూ వస్తున్నందున బ్యాంకర్లు కూ డా పెరుగుతున్న భూముల ధరలకు తగ్గట్టుగా రుణాల పరిమితి పెంచాల్సిన అవసరం ఉంది. మార్టిగేజ్ రుణాలను పట్టణాల్లో ఇచ్చిన రీతిలోనే గ్రామల్లో కూడా అమలు చేయాలని రైతులు బ్యాంకర్ల సమితీకి విజ్ఞప్తి చేస్తున్నారు.