నితీష్ చేతుల్లోనే హోం, ఆర్జేడికి సింహభాగం, తేజ్ ప్రతాప్‌కూ అవకాశం
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్యాబినెట్‌లో 31 మంది మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరికి శాఖలు కేటాయించారు. నితీష్‌కుమార్ కీలకమైన హోం శాఖను తనవద్దే ఉంచుకున్నారు. ఆరోగ్యశాఖను తన డిప్యూటీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు ఇచ్చారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ అప్పగించారు. జేడీయూ నేత విజయ్ చౌదరికి ఆర్థిక శాఖ దక్కింది. నితీష్ క్యాబినెట్‌లో సింహభాగం ఆర్జేడీకి దక్కింది. ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయు నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థాన్ అవామీ మోర్చాకు ఒక మంత్రి పదవి దక్కింది. ఒక స్వతంత్ర అభ్యర్థికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. పాత క్యాబినెట్‌లో ఒకే ఒక ముస్లిం నేతకు మంత్రి వర్గంలో చోటు దక్కగా, నితీష్ కొత్త క్యాబినెట్‌లో ఐదుగురు ముస్లిం ఎమ్‌ఎల్‌ఎలకు చోటు లభించింది. యాదవులకు గణనీయంగా ఏడు పదవులు దక్కాయి. ఆర్జేడీ కోటాలో కార్తికేయ సింగ్ (భూమిహార్ ఎమ్‌ఎల్‌సి), సుధారక్ సింగ్ (రాజ్‌పుట్) కు చోటు కల్పించగా, జేడీయూ తన పాత మంత్రివర్గం లోని అగ్రవర్గాల వారిని కొనసాగించింది. దళిత, ముస్లిం వర్గానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం కల్పించింది.