దళిత బంధు దేశానికే ఆదర్శం
ప్రతి ఎస్‌సి కుటుంబానికి రూ.10 లక్షల గ్రాంట్
ఇప్పటికీ 31 వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం
20222-3లో రూ.17,700 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: బ్యాంకు లింకేజీ లేకుండా వంద శాతం గ్రాంటుగా ప్రతి అర్హత కలిగిన దళిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయాన్ని అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దశాబ్దాలుగా సాంప్రదాయక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఏ నాడు ఇలాంటి అద్భుత పథకాల గురించి ఆలోచించి ఉండరు. ముఖ్యమంత్రి కెసిఆర్ మానసపుత్రికగా రూపుదిద్దుకున్న ఈ పథకం 2021-22లో ప్రారంభమయ్యింది. ఈ పథకం క్రింద లబ్దిదారుని బ్యాంకు అకౌంట్ కు నేరుగా సహాయాన్ని జమ చేస్తారు. దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేసి ఆపద సమయంలో ఆదుకునేందుకు ఈ పథకాన్ని బలోపేతం చేయడం జరిగింది. అందులో భాగంగా దళిత బంధు లబ్దిదారుడు రూ.10 వేలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10 వేలు రక్షణ నిధికి జమచేయడం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం అందించారు. ఫలితంగా దళితులు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. జీవనోపాధి కల్పించకున్నారు. 15,402 మంది లబ్దిదారులకు దీని వల్ల ప్రయోజనం కల్గింది.
చాలా మంది లబ్దిదారులు క్యాబ్‌లు నడిపేందుకు కార్లు కొనుగోలు చేశారు. కొందరు ట్రాక్టర్లు, మందుల షాపులు, ఎరువుల దుకాణాలు నెలకొల్పుకున్నారు. మరికొందరు పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇంకొందరు ఆదాయం వచ్చే వృత్తులను ఎంచుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గ పరిధిలో వాసాల మర్రి గ్రామ పంచాయితీలో ఈ పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా 75 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది. ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లోని ఎస్‌సి నియోజకవర్గాలు మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ లోని ఒక్కో గ్రామంలో చేయాలని నిర్ణయించి నిర్ణయించి మధిర లోని చింతకాని మండలంలో అమలుకు రూ. 100 కోట్లు, తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు, చారగొండ మండలానికి రూ.50 కోట్లు, నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లను ప్రభుత్వం లబ్దిదారుల అకౌంట్లలోకి బదిలీ చేశారు. 4,808 మంది లబ్దిదారులకు ఈ సహాయం మంజూరు చేయడం జరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధును రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 100 కుటుంబాల చొప్పున 11,800 కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంతవరకు 10 వేల 803 మంది లబ్దిదారులకు సహాయం మంజూరు చేశారు. ఈ సంవత్సరం మొత్తం 31 వేల మంది లబ్దిదారులకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఇందుకు గాను రూ.4,441 కోట్ల ప్రొవిజన్‌ను ప్రభుత్వం కల్పించింది. ఇందులో రూ.3,100 కోట్లను జిల్లాలకు ప్రభుత్వం విడుదల చేసింది. 2022-23లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1500 యూనిట్ల ద్వారా దళిత కుటుంబాలకు రూ.17,700 కోట్లను కేటాయించడం జరిగింది. దీని ద్వారా 2 లక్షల 82 వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించనున్నారు. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.