Tuesday, November 5, 2024

317 జిఒ దారెటు?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు నీళ్లు, నిధులు, నియామకాలు, స్థానికత కోసం పోరాటం చేసిన మాట నిజమే. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అలానే నిరుద్యోగ యువకులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ జిల్లాలోనూ స్థానిక కోటా కింద 80%, స్థానికేతర్ల కోటా కింద 20 శాతంగా ఉండేది. కానీ ఆనాడు చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం పత్రంలో ఈ అంశం లేని లేదు. కానీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనలో జరుగుతున్నటువంటి అన్యాయానికి తెలంగాణ తొలి దశ ఉద్యమం 1969లో ప్రభుత్వ నిరుద్యోగుల జరుగుతున్నటువంటి అన్యాయంపై పోరాటం చేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలకు అనుగుణంగా 610 జిఒను ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావటం జరిగింది. ఈ జిఒ వల్ల తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విభజన రేఖ ఏర్పడింది. కానీ 610 జిఒను ఆనాటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు కూడా పట్టించుకోకుండా ఆ జిఒ ఏకంగా తుంగలో తొక్కి, తిరిగి వారు ఏదైతే అనుకున్నారో అదే రకంగా నియామకాలు, పదోన్నతులు ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత తెలంగాణ నాన్- గెజిటెడ్ ఉద్యోగుల సంఘం 610 జిఒపై తీవ్రంగా కొట్లాడంతో పాటు తెలంగాణలో ఉన్న 10 జిల్లాలలో ఉద్యోగులతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు చేసి అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది.

దాని తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణ ఉద్యమం ఉధృతస్థాయిలో నడుస్తున్న క్రమంలో హైదరాబాదు జిల్లాను 14 ఎఫ్ పేరిట ఫ్రీ జోన్ చేయడం జరిగింది. దీని మూలాన తెలంగాణ మలిదశ ఉద్యమం అటు ఉద్యోగులు, ఉస్మానియా విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పెద్ద ఉద్యమాన్ని చేశారు. ఉద్యమం తీవ్రస్థాయి చేరడం హైదరాబాద్ ఫ్రీజోన్ అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టడంతో పాటు రాజకీయ పరిణామాలు ఆనాడు ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉవ్వెత్తున చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిణామాలలో భాగంగా ఆనాటి ఉన్న యుపిఎ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 నాడు ఆవిర్భావమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న పది జిల్లాల నుంచి 2016 అక్టోబర్ 11 నాడు 31 జిల్లాలతో పాటు దాని తర్వాత అదనంగా మరో రెండు జిల్లాలు మొత్తం కలిపి 33 జిల్లాలుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది.

2016 అక్టోబర్ 11 దసరా నాడు కొత్త జిల్లాలు అట్టహాసంగా ప్రారంభించుకోవడం ఆనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటే ఒక్క ఉద్యోగుల లోకం మాత్రం పండగ లేకుండా నూతన జిల్లాలకు 10 జిల్లాల్లో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేస్తూ ఆర్డర్ టూ సర్వ్ పేరుతో ఉద్యోగులను నూతన జిల్లాలకు తరలించారు. తెలంగాణలో అప్పుడున్న పాత జిల్లాలు తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల పరిధిలో సర్దుబాటు చేయడం జరిగింది. కానీ జిల్లాలలో ఎక్కడ కూడా జనాభా నిష్పత్తి ఆధారంగా ఉద్యోగులను క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయం చేయలేకుండా ఉద్యోగస్థులను సర్దుబాటు చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని జిల్లాలలో చేసినట్లయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ జరిగి ఉండేవి అని ఆనాడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఒక వాదన కూడా ఉంది. నూతన జిల్లాలతో పాటు అన్ని శాఖలు జిల్లాలో ఏర్పడినప్పటికీ ఉమ్మడి జిల్లాలలో కొత్త జిల్లాలు ఏర్పడి ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగులను తాత్కాలిక బదిలీలు చేశారు. ఆ బదిలీలు రాబోయే కాలంలో శాశ్వత బదిలీలుగా మార్చబడ్డాయి. దాని తర్వాత 33 జిల్లాలను అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడు జోన్లుగా రెండు మల్టీజోన్లుగా చేశారు.

ఏడుజోన్లలో బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న సిరిసిల్ల, చార్మినార్, జోగులాంబ, యాదాద్రి జోన్లుగా రెండు మల్టీ జోన్లుగా మల్టీ జోన్‌లో బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న సిరిసిల్లలు, మల్టీ జోన్ రెండు పరిధిలో చార్మినార్, జోగులాంబ, యాదాద్రిగా చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపించడం దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం దాని ద్వారా ఆనాడు ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపిన జిఒ 317 దాని ఆధారంగా ఉద్యోగులను సర్దుబాటు చేయాలని ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిర్ణయించారు. అప్పటికే పాత స్థానంలో కొనసాగుతున్నటువంటి జోన్ 5, జోన్ 6 ఆధారంగా చేస్తూ ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉండగా అవేవీ పట్టించుకోకుండా నూతనంగా తీసుకొని వచ్చినటువంటి 317 జిఒ ఆధారంగా ఉద్యోగులను సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులను నాలుగు భాగాలుగా విభజించి చూస్తూ జిల్లా స్థాయి ఉద్యోగులు, జోనల్ స్థాయి ఉద్యోగులు, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగులు, రాష్ట్ర స్థాయి ఉద్యోగులుగా విభజించారు. దాని ఆధారంగానే ఉద్యోగులను సర్దుబాటు చేయాలని ఉద్యోగుల సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టింది.

దాని ద్వారా ఉద్యోగం చేస్తున్నటువంటి సీనియర్ ఉద్యోగులలో ఇబ్బంది తలెత్తకుండా జూనియర్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్థులు మాత్రం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దానివల్ల చాలామంది ఉద్యోగులు వారి స్థానికత కాకుండా వేరే జిల్లాలకు శాశ్వత ప్రాతిపదికన సర్దుబాటు చేయడం జరిగింది. దీని వల్ల చాలా మంది ఉద్యోగులు వారి స్థానికతను కోల్పోవడం కూడా జరిగింది. నూతన జిల్లాలు ఏర్పడినప్పుడు, అలాగే 317 జిఒ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులను రెండుసార్లు సర్దుబాటు చేశారు. ఈ జిఒ ద్వారా అసలు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కాకుండా ఒక జిల్లా ఉద్యోగిని రాష్ట్రంలో 33 జిల్లాలలో బదిలీ చేయడం జరిగింది. మొదటి జోన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల రెండో జోన్లో, రెండో జోన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను మొదటి జోన్ లో ఇలా శాశ్వత ప్రాతిపదికన బదిలీలు చేయడం జరిగింది.

దీనివల్ల అసలు తెలంగాణ కోసం ఉద్యోగులు చేసిన పోరాటానికి ఫలితం లేకుండా స్థానికంగా ఉద్యోగం చేయకపోగా వారు వేరే జిల్లాలకు బదిలీ చేయడం ద్వారా ఉద్యోగులు తీవ్ర మనోవేదన గురికావడంతో పాటు వారి స్థానికతపై పెద్ద చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది. 317 జిఒ ద్వారా బదిలీ అయిన ఉద్యోగులు అసలు స్థానికత ఎక్కడా అనే అంశం చాలా మంది ఉద్యోగుల ప్రశ్నార్థకంగా మారింది. చాలా జోన్లలో గానీ, జిల్లాలలో గాని వారికి క్యాడర్లలో జూనియర్లకు ప్రమోషన్లు రావడం ఒక జోన్‌లో ఎంత సీనియర్ ఉద్యోగి అయిన ప్రమోషన్ రాకపోవడం కూడా జరిగింది. జిల్లా కేంద్ర ఉద్యోగులను రాష్ట్రం నలువైపులా కూడా బదిలీలు చేయడం, దాని ద్వారా ఉద్యోగులు ఆర్థికంగా కూడా నష్టపోయారు. ఇదంతా జరిగిన పరిణామక్రమంలో 2023 సంవత్సరంలో ఎన్నికలు రావడం ఈ జిఒ ఎలక్షన్ల ప్రచారంలో జోరుగా ప్రచారం కూడా చేయడం జరిగింది.

ఆనాడు ఏకంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 317 జిఒ బాధితులకు కాంగ్రెస్ పార్టీ రాగానే న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. తెలంగాణలో జరిగిన అధికారిక మార్పులు కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వచ్చిన రెండు మూడు నెలలకు 317 జిఒపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడం, 317 జిఒపై వినతులు తీసుకోవడం కూడా జరిగింది. ఈ వినతిలో ఉద్యోగస్థులు దాదాపుగా 50 వేలకు పైగా వినతులు రావడం అంటే ఆ జిఒ ఉద్యోగులపై ప్రభావం ఎంత ఉందనేది అర్థమైతా ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం జిల్లా జోన్, మల్టీ జోన్ పోస్టులను ఖాళీలను భర్తీ చేయాలని, వివిధ నోటిఫికేషన్లు తీసుకొని రావడం, నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. వీటితో పాటు ఉద్యోగుల బదిలీలను సైతం చేసింది.

దీని ద్వారా 317 బాధిత ఉద్యోగుల ఆశలు ఆవిరైపోయాయి. ఎందుకంటే 317 జిఒ బాధితులను తిరిగి వారి స్థానికతను తీసుకొని రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఖాళీలు లేనటువంటి పరిస్థితి నెలకొంది. మంత్రివర్గం చెప్పిన మాట అవసరమైతే పదివేల పోస్టులను సూపర్ న్యూమరి పోస్టులను సృష్టించి వారిని ఆదుకుంటామని చెప్తున్నా కూడా అది అయ్యే పనా అని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటారు. సూపర్ న్యూమరి పోస్టులు సృష్టించడం సాధ్యమయ్యే పని కాదని మేధావి వర్గాలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా 317 జిఒ బాధితులను ప్రభుత్వం ఆదుకొని వారికి సత్వర న్యాయం చేయాలని అటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు. త్వరలో వీటికి పరిష్కారం లభించి 317 జిఒ బాధితులు అందరూ కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిద్దాం.

కోమండ్ల విక్రం రెడ్డి
99497 60260

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News