Monday, March 17, 2025

అమెరికాలో ప్రకృతి విపత్తుల బీభత్సం

- Advertisement -
- Advertisement -

మధ్య, దక్షిణ అమెరికా వ్యాప్తంగా టోర్నడోలు, పెను గాలులు సృష్టించిన బీభత్సంలో ఇళ్లు ధ్వంసమయ్యాయి, పాఠశాలలు తుడిచిపెట్టుకునోయాయి,సెమీట్రాక్టర్ ట్రెయిలర్లు పల్టీకొట్టాయి. పెను తుపానుకు కనీసం 32 మంది బలి అయ్యారు. తుపాను వల్ల బాగా దెబ్బ తిన్న వేయిన్ కౌంటీలో తన బంధువు ఇంటి వద్ద శిథిలాల్లో శుక్రవారం రాత్రి చెల్లాచెదురుగా పడి ఉన్న ఐదు శవాలను తాను, ఇతర సహాయక సిబ్బంది కనుగొన్నామని మిస్సౌరి వాసి డకోటా హెండర్సన్ తెలిపార. రాష్ట్రంలో శిథిల భవనాల్లో కనీసం డజను మంది మరణించారని అధికారులు తెలిపారు. కాగా, మూడు కౌంటీల్లో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు, తుపానులు తూర్పు దిశగా అలబామా వైపు కదలగా మరి ముగ్గురు శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత గల్లంతయ్యారని మిస్సిసిపి గవర్నర్ టేట్ రీవ్స్ వెల్లడించారు. అలబామాలో ఇళ్లు. రోడ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఆర్కన్సాస్‌లో ముగ్గురు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఆర్కన్సాస్ గవర్నర్ సారాహ్ హుక్కబీ సాండర్స్, జార్జియా గవర్నన్ బ్రియాన్ కెంప్ తమ తమ ప్రాంతాల్లో ఎమర్జన్సీ ప్రకటించారు. జార్జియాలో ఇసుక తుపాను ఉద్ధృతికి శుక్రవారం కనీసం 12 మంది మరణించారు. కాన్సాస్ హైవేపై కనీసం 50 వాహనాలు ఒకదానినొకటి ఢీకొని కుప్పలుగా పేరుకుపోగా ఎనిమిది మంది వ్యక్తులు మృతి చెందారు. టెక్సస్‌లోని అమరిల్లోలో ఇసుక తుపాను ధాటికి కార్లు ప్రమాదానికి గురి కాగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఓక్లహామా రాష్ట్రంలో 130 పైచిలుకు కార్చిచ్చులు రేగగా కొన్ని కమ్యూనిటీల్లో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అక్కడ సుమారు 300 ఇళ్లు దెబ్బ తినడమో, ధ్వంసం కావడమో జరిగింది. సుమారు 689 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దగ్ధమైందని, ఓక్లహామా నగరం ఈశాన్య ప్రాంతంలో తన సొంత ఇంటిని నష్టపోయానని గవర్నర్ కెవిన్ స్టిట్ మీడియా గోష్ఠిలో వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News