Monday, November 25, 2024

కదిలిస్తే కన్నీరే…!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మరుగుజ్జలు (వికలాంగులు) మాకు ఉద్యోగం కావాలని గాంధీభవన్‌కు రాగా, తాము సహారా సంస్థ వల్ల కోట్లలో నష్టపోయామని చాలా ఏళ్లుగా ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మమ్మల్ని ఆదుకోవాలని మరికొందరు గాంధీభవన్‌కు వచ్చారు. మా భూమిని కొందరు కబ్జా చేశారు, మీరే మాట్లాడాలని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి విన్నవించగా, మరికొందరు మల్లన్నసాగర్ నిర్మాణం కోసం తాము భూములను ఇచ్చామని తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంతవరకు దక్కలేదని ఆ ప్యాకేజీని ఇప్పించి తమను ఆదుకోవాలని మరికొందరు ‘మంత్రుల ముఖాముఖీ’ కార్యక్రమానికి వచ్చారు.

ఇలా ఎవరిని చూసినా, ఎవ్వరిని కదిపినా తమ కష్టాలను దరఖాస్తుల రూపంలో తీసుకొని గాంధీభవన్‌కు వచ్చారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ గోడును కాంగ్రెస్ ప్రభుత్వం వింటుందని అందుకే మంత్రులను కలవడానికి వచ్చామని వారు పేర్కొంటుండడం విశేషం. బుధవారం మొదటగా ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ఆ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహా హాజరయ్యారు. ఆ సమయంలోనూ ఇలాగే తమ సమస్యలను ఏకరవు పెట్టగా మొత్తం 285 దరఖాస్తులు రాగా 30 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను వెంటనే మంత్రి దామోదర పరిష్కరించారు.

ఇంటిస్థలాలు, రేషన్‌కార్డుల దరఖాస్తులు ఇక్కడ వద్దు: మంత్రి ఉత్తమ్
ఇక శుక్రవారం రెండోసారి ఈ కార్యక్రమం జరగ్గా దీనికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తులు సైతం 320 రావడం విశేషం. ప్రస్తుతం దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండడంతో వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై కాంగ్రెస్ వర్గాలు ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఎక్కువగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటిస్థలాల గురించి వస్తుండడంతో దరఖాస్తులను తీసుకొని ఇక్కడకు రావొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ 02వ తేదీ నుంచి ప్రతి జిల్లాలో ఇంటిస్థలాలతో పాటు రేషన్‌కార్డులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తామని కచ్చితంగా అక్కడ దరఖాస్తులను ఇవ్వాలని మంత్రి సూచించడం విశేషం. త్వరలోనే రేషన్ కార్డులకు, హెల్త్ కార్డులకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు.

సుమారు 4 గంటల పాటు దరఖాస్తుల స్వీకరణ
గాంధీ భవన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు, 317 జీఓ బాధితులు, మల్లన సాగర్ ముంపు బాధితులు, సహారా, డికెజెడ్ టెక్నాలజీ కంపెనీల బాధితులు, పెన్షన్, రేషన్‌కార్డు సమస్యలు పరిష్కరించాలంటూ 320 అర్జీలు వచ్చాయి. గాంధీభవన్‌కు భారీగా దరఖాస్తు దారులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్‌లు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సుమారు 4 గంటల పాటు దరఖాస్తు దారుల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దరఖాస్తులను తీసుకున్నారు. గాంధీ భవన్‌కు వచ్చిన దరఖాస్తులను శాఖల వారీగా సిబ్బంది నమోదు చేసుకున్నారు. మహిళలు, గర్భిణులు, తల్లులు, వికలాంగులు, వృద్ధుల నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించారు.

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది: పిసిసి అధ్యక్షుడు
ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని, ఆ నమ్మకం తోనే ప్రజలు వారి సమస్యలను తమకు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం అన్ని పనులను వేగవంతం చేసి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రజలు ఓపికతో ఉండి పనులు చేయించుకోవాలని పిసిసి అధ్యక్షుడు సూచించారు.

మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలి: నర్సిరెడ్డి
మల్లన్నసాగర్ నిర్వాసితులను ఆదుకోవాలని గజ్వేల్ కాంగ్రెస్ ఇన్‌చార్జీ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది నాయకులు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పటివరకు అందలేదని, గత ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజలంతా నిరాశ్రయులయ్యారని, ప్రస్తుతం తమ ప్రభుత్వమైనా ఆదుకోవాలని నర్సిరెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌తో విన్నవించుకున్నారు. గతంలో భూ సేకరణ సమయంలో గుడి స్థలానికి బదులు మరోచోట స్థలం, బడి స్థలానికి బదులుగా మరోచోట స్థలం, స్మశానానికి స్థలం ఇస్తామని దీంతోపాటు 70 ఏళ్లు దాటిన స్థానికులకు బ్రతుకుదెరువు కోసం ఉపాధి వేతనం అందిస్తామని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ప్రకటించారని ప్రస్తుతం ఇవన్నీ కూడా తమకు అందడంలేదని వారు మంత్రి ఎదుట వాపోయారు.

గత ప్రభుత్వ హయాంలో పోరాటం చేసినా స్పందించలేదు
సిద్దిపేట కలెక్టర్ నుంచి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని దానికి సంబంధించిన నిధులను (రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు) విడుదల చేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని స్థానికులకు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్వాసితులు సుమారుగా 10 వేల మంది ఉంటారని వారి కుటుంబాలకు మన ప్రభుత్వం చేయూత అందించాల్సిన అవసరం ఉందని నర్సిరెడ్డి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో తాను నిర్వాసితులకు అండగా నిలిచానని ఆ సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు అండగా నిలిచారని ప్రస్తుతం తమ ప్రభుత్వం ఉన్నందున ఆ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు చాలా సంతోషిస్తారని ఆయన తెలిపారు. దీంతోపాటు బాధితులకు ఇళ్లను, ప్లాట్లను కూడా కేటాయించి వారికి మనోధైర్యం కల్పించాలని ఆయన సూచించారు.

మాకు ఉద్యోగం ఇప్పించండి: మంత్రికి మరుగుజ్జుల విజ్ఞప్తి
కాగజ్‌నగర్ నుంచి వచ్చిన నలుగురు మరుగుజ్జులు (వికలాంగులు) ఫల్గుణవల్లి, పూర్ణిమవల్లి, మంగళ, రాఖీలు మంత్రిని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. పుట్టుకతోనే తమ తండ్రిని కోల్పోయామని, ఇన్ని రోజులుగా తమ తల్లి తమలను ఆదుకుందని ప్రస్తుతం తమ తల్లికి కళ్లు కనిపించడం లేదని, తమకు ప్రభుత్వం నుంచి అందుతున్న పింఛన్ తమ వైద్యానికే సరిపోవడం లేదని ఎలాగైనా తమకు ఉద్యోగం ఇప్పించాలని వారు మంత్రిని కోరారు. తాము మరుగుజ్జులమైనా డిగ్రీ, పిజిలను చేశామని తమ విద్యార్హత సరిపోయే ఉద్యోగం ఇచ్చి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను సైతం వారు కలిసి తమ దీనస్థితి గురించి వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, దీనిపై సిఎంతో చర్చిస్తానని మంత్రి వారికి హామీనిచ్చారు.

సహార సంస్థ నుంచి డబ్బులు ఇప్పించాలని మంత్రికి వినతి
సహార సంస్థలో తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతూ బాధితులు (పూజిత, బాలయ్య, మంజుల, రాము, రాజయ్య, రమేష్, నారాయణ, రాజేశ్వరి)లు గాంధీభవన్‌కు వచ్చారు. ఈ విషయమై చాలా ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని గత ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదని ఇప్పటికే కేంద్రంలోని పలువురు మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా తమకు న్యాయం జరగడం లేదని బాధితులు మంత్రితో పేర్కొన్నారు. గతంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తమ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినా ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వమైనా దాని గురించి ఆలోచించాలని వారు మంత్రితో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 13 కోట్ల మంది బాధితులు ఉన్నారని, అందులో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా ఉన్నారన్నారు. అయితే 2022లోనే సహార సంస్థ డిపాజిట్లను సేకరించడాన్ని కేంద్రం నిషేధించిందని అయినా కొందరు సహారా పేరుతో దొంగచాటుగా డిపాజిట్లను సేకరించి మరింత మందిని మోసం చేస్తున్నారని వారు మంత్రితో పేర్కొన్నారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఇది కేంద్ర పరిధిలోని అంశమని రాష్ట్రం నుంచి ఎలాంటి సాయమైనా అందిస్తామని మంత్రి బాధితులతో పేర్కొన్నారు.

ధరణి వల్ల భూమి రికార్డులకు ఎక్కలేదు: మంత్రికి విహెచ్ విజ్ఞప్తి
కోదాడలో ఓ రైతు భూమి ధరణి వల్ల రికార్డుల్లోకి ఎక్కలేదని దీనిపై తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ మంత్రి ఉత్తమ్‌ను కలిసి విన్నవించారు. ధరణిలో జరిగిన పొరపాటు వల్ల ఆ రైతు ఆ భూమిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విహెచ్ మంత్రి ఉత్తమ్‌కు విజ్ఞప్తిచేశారు.

మా అమ్మ మెడికల్ బిల్లులను ఇప్పించండి: మహబూబ్‌నగర్ వాసి విజ్ఞప్తి
మా అమ్మకు సంబంధించిన మెడికల్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్‌కు చెందిన ఖాజా మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. సూరాయిబేగం అనే మహిళకు సంబంధించి మెడికల్ బిల్లులు సుమారుగా రూ.1.19 లక్షలను ప్రభుత్వం నుంచి ఇప్పించాలని ఆమె కుమారుడు మంత్రిని కలిసి కోరారు. ఫ్యానల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోకపోవడంతో బిల్లులను అధికారులు విడుదల చేయడం లేదని అత్యవసర సమయంలో వేరే ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నామని దీనికి సంబంధించిన అన్ని బిల్లులను సమర్పించామని ఇప్పటికైనా ఆ బిల్లులను ఇప్పించాలని ఖాజా మంత్రితో పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయాలని మంత్రికి ఎంఆర్‌పిఎస్ వినతి
మేడి పాపయ్య ఆధ్వర్యంలో ఎంఆర్‌పిఎస్‌కు సంబంధించి కార్యకర్తలు భారీ ఎత్తున గాంధీభవన్‌కు వచ్చారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో త్వరితగతిన అమలయ్యేలా చూడాలని దీనిపై వేసిన సబ్ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందచేసేలా చర్యలు చేపట్టాలని మేడి పాపయ్య మంత్రి ఉత్తమ్‌కు విజ్ఞప్తి చేశారు.

జిఓ 46ను రద్దు చేయాలని మంత్రికి వినతి
జిఓ 46ను రద్దు చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థులు మంత్రి ఉత్తమ్‌ను కలిసి విన్నివించారు. హైదరాబాద్ పరిధిలో ఉత్తీర్ణులైన వారికి ఒక మాదిరిగా నల్లగొండ స్థానికత ఉండి ఈ జిల్లా నుంచి ఉత్తర్ణులైన వారికి ఒక రకంగా ఈ జిఓ వర్తిస్తుందని దీనివల్ల నల్లగొండ నుంచి పరీక్ష రాసిన వారికి 150 మార్కులు వచ్చినా తాము మాత్రం కానిస్టేబుల్ పోస్టుకు ఎంపిక కాలేకపోతున్నామని, అదే హైదరాబాద్ స్థానికత ఉండి అక్కడి నుంచి పరీక్ష రాసిన వారికి 90 మార్కులు వచ్చినా వారు పోస్టుకు ఎంపిక అవుతున్నారని దీనివల్ల 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాము నష్టపోతున్నామని దీనిపై ప్రభుత్వం పునరాలోచించి జిఓ 46ను రద్దు చేయాలని వారు మంత్రికి సూచించారు.

‘నా భర్త నా దగ్గరకు రావడం లేదు’
నా భర్త నా దగ్గరకు రావడం లేదు, ఒకసారి మీరు మాట్లాడి ఒప్పించాలని కొండగట్టు నుంచి వచ్చిన ఓ మహిళ మంత్రి ఉత్తమ్‌ను కలిసి విన్నవించింది. ఈ సమస్యపై మంత్రి స్పందిస్తూ తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆమెకు హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News