Friday, November 22, 2024

విశ్వవిజేతల సమర వేదిక

- Advertisement -
- Advertisement -

Olympics

క్రీ.పూ. 776లో ప్రారంభమై, క్రీ.పూ 394లో ముగిసిన పురాతన ఒలింపిక్ క్రీడలు తిరిగి 1894లో జూన్ 23వ తేదీన ఫ్రాన్స్‌లో ‘పియరీ డీ కౌబర్టీన్’ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ తిరిగి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడానికి నిర్ణయించిన తేదీనే ప్రతి సంవత్సరం జూన్ 23వ అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీనిని అనుసరించి 1896లో ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు గ్రీస్ రాజధాని ‘ఏథెన్స్’ లో ప్రారంభమైనవి. ప్రపంచ యుద్ధ సమయంలో తప్ప, మిగిలిన ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయి. మొదటి సారిగా 1948లో ‘ఒలింపిక్ డే’ జరపగా, 1978లో ఒలింపిక్ చార్టర్ ద్వారా అన్ని దేశాల వారు, తమ తమ దేశాల్లో ‘నేషనల్ ఒలింపిక్ కమిటీ (యన్.ఒ.సి)’ ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలను చేయాలని నిర్ణయించారు.
ఒలింపిక్ పతాకాన్ని 1913లో పియరీ డీ కౌబర్టీన్ ఆధ్వర్యంలో తయారు చేశారు. 1920 బెల్జియంలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మొదటి సారిగా ఎగురవేశారు. పతాకంపై ఐదు రింగులు, ఐదు రంగుల్లో ఉంటాయి. నీలం రంగు- యూరప్ ఖండం, నలుపు- ఆఫ్రికా, ఎరుపు -అమెరికా, పసుపు- ఆసియా, ఆకుపచ్చ- ఆస్ట్రేలియా తెలియజేస్తూ, ప్రపంచ ప్రజలను క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. అందుకే ఒలింపిక్స్ ‘విశ్వ క్రీడలు’ గా ప్రసిద్ధి చెంది, వీటిలో విజేతలుగా నిలవాలని ప్రపంచ క్రీడాకారుల ఆకాంక్ష.
అనేక దేశాలు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ఆయా దేశాల క్రీడాకారులకు వసతులు కల్పిస్తూ, క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికా, రష్యా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, జర్మనీ వంటి దేశాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధిక పతాకాలు సాధిస్తూ ముందు వరుసలో ఉంటున్నాయి. మన దేశం కూడా హాకీలో అనేక సార్లు విజేతగా నిలిచింది. మన దేశ క్రీడాకారులు కూడా భవిష్యత్తులో మంచి ప్రతిభ కనపరచాలి అని కోరుకుందాం. మన ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందివ్వాలి అని ఆశిద్దాం.
ఒలింపిక్ స్ఫూర్తి సందేశం (EPIGRAM)– ‘జీవితంలో గెలవడం కంటే పోరాడడమే ముఖ్యం’.. ఒలింపిక్ క్రీడా ఆశయం (MOTTO) –వేగంగా, ఉన్నతంగా, బలంగా ఉండాలని. ఈ అంశాన్ని ‘ఫాదర్ డిడన్’ రూపొందించారు. ఒలింపిక్ జ్యోతిని మొదటి సారిగా 1928 ఆమ్‌స్టర్‌డామ్ క్రీడల్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత జ్యోతి 1936 బెర్లిన్ క్రీడలు నుండి అమలుఅవుతుంది. 1972 నుండి ‘మస్కట్’ ప్రవేశపెట్టినారు. ఇక 1987 నుండి ‘ఒలింపిక్ రన్’ నిర్వహిస్తూ, క్రీడలు పట్ల ఆసక్తి, ఉత్సాహాన్ని పెంపొందించటానికి కృషి చేస్తున్నారు. పరుగే కాకుండా మూడు (3) అంశాలను ప్రజలకు అవగాహన కల్పించుట జరుగుతుంది. ఒకటి ‘మూవ్’ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేయుట, రెండు ‘లెర్న్’ విద్యా విలువలు, మానవత్వం విలువలు, ఎయిడ్స్ పై అవగాహన కల్పించుట, మహిళా సాధికారత, శాంతి, స్నేహ సంబంధాల పెంపుదలకు, మూడు ‘డిస్కవర్’ నూతన క్రీడల ప్రోత్సా హం.
ఈ విధంగా ఆటలే కాకుండా మొత్తం ప్రపంచం అంతా ఆరోగ్యం, ఉత్సాహం, శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విశ్వక్రీడలు జరుగుతున్నాయి. క్రీడలు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుచేతనే కొన్ని దేశాలు విద్యార్థుల సిలబస్‌లో పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టినారు. ఎగ్జిబిషన్లు, సభలు సమావేశాలు నిర్వహించి క్రీడలు ఆవశ్యకత తెలుపుతున్నారు. ‘ఊబకాయం’ ఒబెసిటీ తరుగుదలకు తిరుగులేని సాధనం క్రీడలు మాత్రమే. అలాగే పోషక ఆహారం లోపా లు కూడా బయటపడుతున్నాయి. చర్యలు తీసుకోవటానికి అవకాశాలు ఏర్పడుతుం ది. సహాయం చేయటానికి వీలు కలుగుతుంది. లింగ, వయో భేదం లేకుండా, ప్రాంతీయ, మత, భాషా భేదాలు లేకుండా సమస్త ప్రజలు నుండి క్రీడాకారులు ఉద్భవించడానికి ఈ ఒలింపిక్స్ క్రీడలు దోహదపడుతున్నాయి. అనేక రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ‘నోబెల్ బహుమతి’ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో, క్రీడల్లో ‘ఒలింపిక్ విజేత’ గా నిలబడటం అంత ప్రాధాన్యత సంతరించుకుంది అనుటలో సందేహం లేదు.
గత సంవత్సరం కాలంగా కరోనా ప్రభావం వలన చాలా మంది క్రీడాకారులు తమ క్రీడలకు దూరమై, నిరాశతో, అశక్తతగా ఉన్న మాట వాస్తవం. ఈ సంవత్సరం 2021 జూలై 23 నుండి జపాన్ రాజధాని ‘టోక్యో’ లో 32వ ఒలింపిక్ క్రీడలు జరగవలసి ఉన్నవి. అదే విధంగా భవిష్యత్తులో 2024లో పారిస్ (ఫ్రాన్స్) లో, 2028లో అమెరికాలో ఈ ఒలింపిక్ క్రీడలు జరుగవలసి ఉన్నది. ప్రపంచ ప్రజలను ఏకం చేసే ఈ ‘ఒలింపిక్స్ క్రీడలు’ ప్రపంచ మానవాళిని సంతోషంలో ముంచెత్తే ‘సంబరం’ అనుటలో సందేహం లేదు..

ఐ. ప్రసాదరావు
9948272919

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News