మా కృషి ప్రమాదంలో పడింది
పాఠ్య పుస్తకాల్లోంచి మా పేర్లు తొలగించండి
ఎన్‌సిఇఆర్‌టికి 33మంది విద్యావేత్తల లేఖ
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్, విద్యావేత్త సుహాస్ పల్షీకర్‌లు బాటలోనే మరికొంత మంది విద్యావేత్తలు నడుస్తున్నారు. పాఠ్యపుస్తకాలలో సలహాదారులుగా ఉన్న తమ పేర్లను తొలగించాలని తాజాగా గురువారం జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్‌సిఇఆర్‌టి)కి లేఖ రాశారు. పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లనూ తొలగించాలని డిమాండ్ చేస్తూ టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ కమిటీలో ఉన్న 33 మంది విద్యావేత్తలు ఈ మేరకు లేఖ రాశారు. పాఠ్యపుస్తకాల్లో చేస్తున్న మార్పుల కారణంగా విద్యారంగంలో తాము చేసిన కృషి ప్రమాదంలో పడిందంటూ అందులో పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం, రాజ్యాంగం రూపకల్పన, ప్రజాస్వామ్యం పనితీరుతోపాటు భారత రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించేందుకు ఈ పాఠ్యపుస్తకాలు రూపొందించబడ్డాయని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో అనేక సంప్రదింపులు, సుదీర్ఘ చర్చల అనంతరం ఇవి తుదిరూపు దిద్దుకున్నాయని గుర్తు చేశారు.
కానీ ఒరిజినల్ పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయడం, వాటిని భిన్నంగా మార్చారని, వాటిని తాము రూపొందించామని చెప్పుకోవడం, వాటిపై తమ పేర్లు ఉండటం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము చేసిన కృషి ప్రమాదంలో పడిందని భావిస్తున్నట్టు విద్యావేత్తలు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాసిన వారిలో జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ కాంతి ప్రసాద్ బాజ్‌పాయ్, అశోకా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ భాను మెహతా, సీఎస్‌డీఎస్ మాజీ డైరెక్టర్ రాజీవ్ భార్గవ, జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్, జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితా మేనన్, హెచ్‌సీయూ మాజీ ప్రొఫెసర్ కేసీ సూరి, కామన్ కాజ్ సంస్థ అధినేత విపుల్ ముద్గల్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ మాజీ డెరెక్టర్ పీటర్ రొనాల్ డిసౌజా తదితరులున్నారు.