ఇటలీలో శనివారం 33 మంది భారతీయ వ్యవసాయ కూలీలకు విముక్తి దక్కింది. వీరిని బానిసత్వపు చెర నుంచి ఇటలీ పోలీసులు రక్షించారు. గత నెలలో ఇజ్రాయెల్‌లో ఓ వ్యవసాయక్షేత్రంలో కూలీగా పనిచేస్తున్న భారతీయ పంజాబీ ఆక్సిడెంట్‌కు గురై, చేయి తెగి తరువాత మృతి చెందిన ఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో వందలాదిగా భారతీయులు ఇటలీలోని పలు పొలాల్లో కూలీలుగా దుర్భర , అనధికారిక ఖైదీల జీవితాలు వెళ్లదీస్తున్న వైనం వెలుగులోకివచ్చింది. ఈ క్రమంలో జరిగిన తనిఖీలు, దర్యాప్తుల దశలో కూలీల శ్రమశక్తిని దోచుకుంటున్న విషయాలు నిర్థారించారు. ఇక్కడికి అత్యధిక వేతనాల పేరిట కూలీలను తీసుకురావడం జరుగుతోంది. నార్తర్న్ వెరోనా ప్రాంతంలో బానిసల తరహా జీవితాలు గడుపుతున్న 33 మంది భారతీయ కూలీలను గుర్తించారు. వీరికి విముక్తి కల్పించారని ఇక్కడి పోలీసు అధికారులు తెలిపారు. కాగా కూలీలను అక్రమంగా వెట్టిచాకిరికి గురి చేస్తున్న ఇద్దరిని నిర్బంధంలోకి తీసుకున్నారు.
వీరి నుంచి ఐదు లక్షల యూరోలు అంటే 545,300 డాలర్ల విలువైన సొత్తును స్వాధీనపర్చుకున్నారు. భారతదేశానికే చెందిన కొందరు గ్యాంగ్‌గా మారి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలను వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేందుకు తీసుకురావడం జరుగుతోతంది. వీరికి 17000 యూరోల వేతనం, పలు ఇతరత్రా భవిష్య ప్రోత్సాహకాలు ఉంటాయని ఆశచూపడం జరిగింది. ఈ వలసదార్లకు పొలాల్లో పనులు ఇవ్వడం, వారానికి ఏడురోజులు పనిచేయించడం, రోజుకు 12 గంటల కూలీ తప్పనిసరి చేయడం జరుగుతోంది. వీరి పత్రాలను తమ వద్ద పెట్టుకుని వీరిని బానిసలుగా చూస్తున్నారని వెల్లడైంది. ఎదురుతిరిగిన వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించడం చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. అక్రమ వలసదార్లని ముద్ర వేసి వీరిని తాము చెప్పినట్లు ఆటాడించుకుంటున్నారని వెల్లడైంది.