Monday, December 23, 2024

33 శాతం బాలల్లో పోషక లోపం!

- Advertisement -
- Advertisement -

 

భారత దేశంలో గత రెండు దశాబ్దాలుగా పేదరికం 21 శాతం తగ్గడం, శిశు మరణాలు సగానికి పైగా తగ్గడం, 80 శాతానికి పైగా గర్భిణుల ప్రసవాలు ఆసుపత్రుల్లో జరగడం, 2 మిలియన్ల పిల్లలు బడులకు దూరమైపోవడం వంటి విభిన్న వాస్తవాలు బయటపడ్డాయి. దీనికి తోడుగా నిన్నటి కొవిడ్- 19 కల్లోలం కారణంగా ఉద్భవించిన సామాజిక ఆర్థిక ప్రభావంతో అదనంగా 6.7 మిలియన్ల 5 ఏండ్ల లోపు బాలలు ప్రమాదకర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, సగానికి పైగా బాలల మరణాలు నమోదు అవుతున్నాయని ‘యూనిసెఫ్ నివేదిక’ కఠిన వాస్తవాలను వెల్లడించడం విచారకరం.

ప్రతి ముగ్గురు బాలల్లో ఒక్కరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలలకు కరోనా లాంటి అనేక అంటువ్యాధులు తొందరగా సోకుతాయని తెలుపుతున్నారు. కడు పేదరికం, పని దొరక్కపోవడం, ఆహార అభద్రత కారణాలు బాలల ఆరోగ్యంపై విషప్రభావాన్ని చూపిస్తున్నాయి. నేడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్న సమయంలో అత్యవసర పోషకాహార సరఫరా వ్యవస్థలు దెబ్బతిని ధరలు పెరగడంతో బాలలు కనీస పోషకాహారానికి దూరం అవుతూ, తీవ్ర పోషకాహార లోప స్థితితో 38.4 శాతం బాలల శారీరక అభివృద్ధి ఆగిపోయిన కారణంగా వయసు కన్నా అతి తక్కువ ఎత్తుతో (స్టంటింగ్) పొట్టి వాళ్ళలా మారుతున్నారని కూడా గుర్తించారు.

మన దేశంలో మగ శిశువుల కన్నా ఆడ శిశు మరణాలు ఎక్కువగా నమోదు కావడం బాధాకరం. దీని కారణంగా మగ ఆడ పిల్లల నిష్పత్తి 1000:900 ఉండడం ప్రకృతి విరుద్ధమని తెలుసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా 5 ఏండ్ల లోపు మగ బాలలు 7 శాతం మరణిస్తే, ఇండియాలో 11 శాతం ఆడ బిడ్డలు మరణిస్తున్నారు. గ్రామీణ, పట్టణ మురికివాడలు, యస్‌సి, యస్‌టి, పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పోషకాహార లోపం, ఆరోగ్య వసతుల లేమి, బాల్య వివాహాలు, పాఠశాలలకు పిల్లలు దూరమవడం, పరిసరాలతో పాటు వ్యక్తిగత అపరిశుభ్రత, సురక్షిత తాగునీరు లేకపోవడం లాంటి సమస్యలు చుట్టు ముట్టుతున్నాయి. దేశ కౌమారదశ (10 19 ఏండ్ల) పిల్లల జనాభా 253 మిలియన్లు ఉన్నారు.

బాల్యవివాహాలు చేసుకున్న కూతుర్ల సంఖ్యలో ప్రపంచ దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. వీరిలో అనారోగ్యం, చిన్నతనంలోనే తల్లి కావడం, పోషకాహారం అందకపోవడం, ఆర్థిక వెనుకబాటుతనం, బలహీన సంతానం ఉండటం వంటి సమస్యలు వెన్నాడుతాయి. కౌమారదశ బాలికల్లో 54 శాతం, బాలురలో 30 శాతం రక్తహీనతతో సతమతం అవుతున్నారు. మన దేశంలో 60- 90 శాతం బాలికలు ఏదో ఒక సందర్భంలో లైంగిక అత్యాచారాలు, హింసలు లేదా వేధింపులను అనుభవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 189 దేశాల మానవ అభివృద్ధి సూచిక జాబితాలో ఇండియా 130వ స్థానంలో ఉన్నది. భారత దేశ భాగ్య విధాతలుగా ఎదగాల్సిన బాలలు ఆహార కొరత, పోషకాహార లోపం, అనారోగ్యం, అవిద్య, బాలకార్మిక వ్యవస్థ, బాలల లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు లాంటి తీవ్ర సమస్యలతో సంసారం చేస్తున్నారు.

కరోనాకు ముందు ప్రపంచ వ్యాప్తంగా 47 మిలియన్ల బాలలు పోషకాహార (వేస్టింగ్) సమస్యలతో సహజీవనం చేస్తే, తదనంతర కరోనా విపత్తు తరువాత యుద్ధ కాలంలో వారి సంఖ్య 54 మిలియన్లకు చేరడం మెుదటిసారి ఈ మిలీనియంలో జరిగింది. కరోనా వ్యాప్తితో పేద దేశాలలోని పోషకాహార లోపంతో బాధపడుతున్న 5 సంవత్సరాల లోపు బాలల సంఖ్య 14.3 శాతం పెరిగిందని గుర్తించారు. దీని పర్యవసానంగా సగానికి పైగా బాలలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారని అనుమానిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా 250 మిలియన్ల బాలలకు విటమిన్ ఎ అందలేదని, దాదాపు 25 శాతం వరకు పోషకాహార లోపం పెరిగిందని తేల్చారు. వీటి ఫలితంగా 1.28 లక్షల అదనపు బాలల మరణాలు జరుగవచ్చని విశ్లేషించారు. గర్భిణిలకు అందవలసిన సమతుల పోషకాహారం అందకపోవడం కూడా పరిస్థితి తీవ్రతను మరింత జటిలం చేస్తుందని నివేదిక తెలుపుతోంది.

బాలలకు జీవించడం, శారీరకంగా మానసికంగా ఎదగడం, వేధింపుల నుండి రక్షణ పొందడం, అభివృద్ధిలో పాలుపంచుకోవడమనేవి రాజ్యాంగ హక్కులని గుర్తించింది. ఆకలి, అకాల మరణాలు, అత్యాచారాలు, బాలకార్మిక దురాచారం, విద్య, పోషకాహారం లాంటి సవాళ్ళను దేశం సమర్థవంతంగా ఎదుర్కోవలసి ఉంది. మన దేశంలో 2012- 17 మధ్య కాలంలో 2.43 లక్షల బాలికలు/ మహిళలు కనబడకుండా పోయారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు డాలరు బలపడడం కారణంగా రేపటి పౌరుల పోషకాహార హక్కులను కాపాడేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు వెంటనే స్పందించాల్సిన సమయమిది. ఆహార ఉత్పత్తి రంగాలను ప్రోత్సాహించడం, ఆహార సరఫరా నియంత్రణ, తల్లిపాల రక్షణ, బాలలతో పాటు తల్లులకు సమతుల ఆహార లభ్యతలను కాపాడాల్సి ఉంది.

బాలల్లో పోషకాహార లోపాల్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, పేద కుటుంబాలకు ఆహారాన్ని ఇంటి వద్దనే పంపిణి చేయడం, పాఠశాలల్లో సురక్షిత మధ్యాహ్న భోజనం కల్పించడం లాంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ ప్రణాళిక ప్రకారం కొవిడ్ -19, యుద్ధాల ధాటిని తట్టుకుంటున్న విశ్వమానవాళి, ముఖ్యంగా ఐదేళ్లలోపు బాలలను రక్షించుకోవడానికి రెస్పాండ్ (స్పందించు), రికవర్ (క్షేమంగా బయటపడడం), రీ ఇమేజిన్ (తిరిగి రూపాన్నివ్వడం) అనబడే త్రీ సుత్రాలను ప్రతిపాదించారు. సమస్య జటిలం కాక పూర్వమే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం, బయట పడిన వారిని సంరక్షించుకోవడం అనే విషయాలకు కట్టుబడి బాలలను, తల్లులను ఆరోగ్యవంతులుగా చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముదాం. రేపటి తరాన్ని పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటూ, ఆరోగ్యకర యువ భారతాన్ని నిర్మించుకుందాం.

* డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News