Wednesday, January 22, 2025

మహిళలకు 33% రిజర్వేషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల చట్టసభలతో పాటు పార్లమెంట్‌లోనూ డి లిమిటేషన్ ద్వారా 33 శాతం సీట్లు పంచి వాటిని మహిళలకు రిజర్వు చేస్తామన్నారు. ఈ హామీని కేవలం ఏడాదిలోపే అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. మహిళల రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో ప్రస్తుతం మూస పద్ధతి నడుస్తోందని కెసిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే… దేశ ఆర్థిక విధానం మారాలన్నారు. దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరముందన్నారు. దేశంలోని విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకు మోడీ ప్రభుత్వం యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారుతుందన్నారు. ఇలాంటి కుట్రలపై బిఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తోందని ఈ సందర్భంగా కెసిఆర్ హెచ్చరించారు.

ఆదివారం నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం చెప్పే మాటలకు, అమలు చేస్తున్న విధానాలకు ఎలాంటి పొంతన ఉండడం లేదన్నారు. మోడీ హయంలో కార్పొరేట్ సంస్థలే బాగుపడుతున్నాయే తప్ప…సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని విమర్శించారు. ఆయన మన్‌కీబాత్ అంతా ఉత్తుత్తిదేనని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డంగా అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగాన్ని మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేసినా బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే తిరిగి కేంద్రం ఆధీనంలోకి తీసుకొచ్చి జాతీయ చేస్తామన్నారు. చైనా నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోతున్నప్పుడు వాటిని మన దేశానికి ఎందుకు మళ్లించలేకపోతున్నారని నిలదీశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.

మహిళల కోసం కొత్త విధానం తీసుకొస్తాం

మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని కెసిఆర్ అన్నారు. అన్ని రంగాల్లోనూ వారి ప్రాధాన్యం పెంచుతామని వెల్లడించారు. మహిళల పట్ల మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాలన్న చిత్తశుద్ధి కేంద్రానికి ఏ మాత్రం కనబడడం లేదని విమర్శించారు. మోడీ పదేపదే చెబుతున్న విధంగా బేటీ పడావో…. బేటీ బచావో అనే నినాదం కేవలం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. హథ్రస్ ఘటన మహిళలకు రక్షణ లేదని మరోసారి నిరూపించిందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి పాలసీ డాక్యుమెంట్ తయారవుతున్నదన్నారు. త్వరలోనే మహిళల కోసం బిఆర్‌ఎస్ కొత్త విధానం తెస్తుందని ఈ సందర్భంగా కెసిఆర్ స్పష్టం చేశారు.

దేశంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు

దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అన్నారు. నీటి వినియోగంపై బిఆర్‌ఎస్ ఎజెండా విప్లవాత్మకంగా ఉంటుందన్నారు. వాటర్ పాలసీని మార్చడానికి ఎవరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో నీటి వనరులకు కొదవ లేదన్నారు. అవసరానికి మించి నీళ్లు ఉన్నాయన్నారు. నీళ్ల విషయంలో చెబుతున్నది తన సొంత లెక్కలు కావన్నారు. కేంద్ర జలశక్తి శాఖ చెప్పిన లెక్కలే చెబుతున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.. దేశంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చునని అన్నారు. ట్రిబ్యునళ్ల పేరుతో దశాబ్దాల తరబడి నీటి వాటాలను నాన్చుతున్నారని మండిపడ్డారు. కృష్ణా నీళ్లపై బ్రిజేష్ ట్రిబ్యునల్ 20 ఏండ్లు అయినా ఒక్క తీర్పు ఇవ్వలేదన్నారు.

పవర్ సెక్టార్‌ను జాతీయం చేస్తాం

బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పవర్ సెక్టార్‌ను జాతీయ చేస్తామని కెసిఆర్ స్పష్టం చేసారు. బిఆర్‌ఎస్ పాలసీని అనుసరిస్తే రెండేండ్లలో ఈ దేశం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశంలోని 90 శాతం విద్యుత్ సెక్టార్‌ను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతాం…ఏమన్నా అంటే దేశం కోసం.. ధర్మం కోసం అంటారన్నారు. ఉన్న బొగ్గును ఉపయోగించుకోవడానికి చేతగాని కేంద్రం ప్రైవేట్ వాళ్ల నుంచి కొనుగోలు చేయాలని హుకుం చేస్తున్నది. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన పవర్ సెక్టార్ ను జిందానీ లాంటి వారికి ఎందుకు కట్ట బెడుతున్నారన్నారు.

సంపూర్ణ పరివర్తన కోసమే బిఆర్‌ఎస్

దేశంలోని అన్ని రంగాలలో సంపూర్ణ పరివర్తన కోసమే బిఆర్‌ఎస్ పనిచేస్తుందని కెసిఆర్ అన్నారు. మహారాష్ట్ర వంటి శక్తివంతమైన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుపడాల్సిన అంశమన్నారు. దీని కోసమేనా భగత్ సింగ్ వంటి మహనీయులు ఉరికంబం ఎక్కింది? అని అడిగారు. బిఆర్‌ఎస్ అంటే ఒక పార్టీ కాదు.. ఒక మిషన్ అని అన్నారు. మతం పేరుతో దేశ ప్రజల విభజనను తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. అందువల్ల అందరం కలిసి దేశాన్ని అభివృద్ది చేసుకుందామని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘రీ ఇన్వెంటెడ్ ఇండియా – రీ ఓరియెంటెడ్ ఇండియా’ పేరుతో కెసిఆర్ మీడియాకు ఒక డాక్యుమెంటును అందించారు.

అదానీ కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు

పారిశ్రామికవేత్త అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై మోడీకి లేదని కెసిఆర్ మండిపడ్డారు. ఆయన కోసం దేశాన్ని పూర్తిగా తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ రంగమైన ఎల్‌ఐసిని అదానీకి అప్పగించాల్సిన అవరసం ఏముందని ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటులో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయడానికి మోడీ ప్రభుత్వానికి ఎందుకు భయమని నిలదీశారు. ఒక మామూల వ్యాపారి దునియాలో రెండో స్థానానికి ఎదగడం సాధ్యమేనా? అని కెసిఆర్ ప్రశ్నించారు. కేవలం మోడీ మిత్రుడు కాబట్టే ఎదిగాడన్నారు. ఇక దేశంలో పుష్కలంగా బొగ్గు ఉన్నప్పటికీ అదానీ కంపెనీ నుంచి బొగ్గు కొనుగోలు చేయాల్సిందేనని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ అదానీ కోసం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారన్నారు. దేశానికి పవర్ సెక్టార్ చాలా ముఖ్యమైందన్నారు. బొగ్గు గనులున్న అన్ని ప్రాంతాలకు రైల్వే లైన్లు వేస్తామని కోల్ ఇండియా చెప్పి నిధులు మంజూరు చేసిందన్నారు. అయినప్పటికీ ఆ నిధులతో కేంద్రం రైల్వే లైన్లను వేయలేదన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం జబర్దస్తీ ఎందుకు అని నిలదీశారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రెండేండ్లలోనే దేశంలో నిరంతర వెలుగులు తీసుకొస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. న్యూయార్క్, లండన్‌లో కరెంట్ పోయినా హైదరాబాద్‌లో పోదన్నారు. హైదరాబాద్‌ను పవర్ హైల్యాండ్‌గా మార్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News