లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 34 ఐపిఎస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా మంగళవారం లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపి రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. గత సంవత్సరం జనవరి (2020) వరకు రాష్ట్రంలో 139 మంది ఐపిఎస్ అధికారులు ఉండగా, ప్రస్తుతం 34 ఖాళీలు ఏర్పడ్డాయి. అధికారుల పదవీ విరమణ, రాజీనామాలు, మరణం, సర్వీస్ నుంచి తొలగించడం, పలు ఇతర కారణాలతో పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి నిత్యానంద పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీల భర్తీకి ఐపిఎస్ బ్యాచ్ పరిమితిని క్రమంగా పెంచినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 2019 సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా తెలంగాణకు ఐదుగురు ఐపిఎస్‌లను కేటాయించినట్లు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొన్నది.