న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. గత 24 గంటల్లో 34,703 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. తాజాగా, కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది. 111 రోజుల తరువాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది. కొత్త కేసులు మార్చి 17 నాటి కనిష్ఠానికి చేరగా, మరణాల్లో మూడు నెలల క్రితం నాటి తగ్గుదల కనిపించడం ఊరట కలిగిస్తోంది.
సోమవారం 16,47,424 మందికి పరీక్షలు చేయగా, 34,703 మందికి పాజిటివ్ అని తేలింది. గత 24 గంటల్లో 553 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.06 కోట్లకు చేరుకోగా, ఇప్పటివరకు 4,03,280 మంది మృతి చెందారు. గత 54 రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. సోమవారం ఒక్క రోజే 51, 864 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.97 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,64,357 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.52 శాతానికి దిగింది. సోమవారం 45,82,246 మంది టీకాలు వేయించుకున్నారు. సోమవారం వరకు 35,75,53,612 డోసులు పంపిణీ అయ్యాయి.
34703 new covid-19 cases reported in india