సిటిబ్యూరోః అక్రమంగా తరలిస్తున్న హవాలా డబ్బులను పెద్ద ఎత్తున తరలిస్తున్న ఇద్దరు నిందితులను షాహినాయత్ గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.35,50,000లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ విక్రం సింగ్ మాన్ షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అత్తాపూర్‌కు చెందిన రోహిత్ గిరి కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు, ముషీరాబాద్‌కు చెందిన హమీదుల్లా స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో షాహినాయత్‌గంజ్ పోలీసులు పురాణాపూల్ బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తున్నారు.
అదే సమయంలో ఇద్దరు బైక్‌పై బ్యాగుతో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా రూ.18,00,000 లభించాయి. వాటికి వివరాలు అడుగగా ఇద్దరు డబ్బులకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించలేదు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగతా డబ్బుల గురించి చెప్పారు. వెంటనే నిందితులను తీసుకుని వెళ్లి ముషీరాబాద్‌లో 17,50,000లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వద్ద ఆధారాలు చూపని రూ.35,50,000లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులను ఐటి అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ తదితరులు పట్టుకున్నారు.