ప్రాతినిధ్యం లేదనే దక్షిణాదిపై బిజెపి ప్రతీకారం అందుకు ఆయుధంగా
డీలిమిటేషన్ ప్రక్రియ కేంద్రం అఖిలపక్షాన్ని పిలవాలి జనాభా
నియంత్రించినందుకు శాపం కావద్దు స్టాలిన్ ప్రతిపాదనకు మద్దతు
ఇస్తున్నా కులగణనపై మోడీ ప్రభుత్వం మీనమేషాలెందుకు? బిసిల
డిమాండ్ న్యాయమైందే అయితే అన్యాయం జరగనివ్వం హిందీ అనేది
ఆప్షనల్ మాత్రమే.. బలవంతంగా రుద్దొద్దు దేశంలో తెలుగు అత్యధికులు
మాట్లాడుతున్న రెండో భాష ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్/న్యూఢిల్లీ: గుజరా త్ మోడల్‌కు కాలం చెల్లిందని, తెలంగాణ మోడల్ ప్రస్తుతం ట్రెండ్‌లో నడుస్తోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ మోడల్ టెస్ట్ లాంటిదని తెలంగాణ మోడల్ టీ20 అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరుగుతు న్న ‘ఇండియా టుడే కాంక్లేవ్- 2025’లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గుజరాత్ మోడల్‌ను టెస్ట్ ఫార్మాట్ తో సి ఎం రేవంత్ పోల్చారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు తెలంగాణ అభివృద్ధి నమూనాను కలిగి ఉన్నాయన్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని మౌలిక సదుపాయాలు, హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను బేరీజు వేయాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ మూడు తెలంగాణ మోడల్ అని పేర్కొన్నారు. అభివృద్ధిలో తాము పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూసుకోవడం లేదని మా పోలిక అంతా న్యూయార్క్, సియోల్, టోక్యో, ఇతర దేశాలతోనే పోటీ అని ఆయన అన్నారు.
35 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి
అహ్మదాబాద్‌కు తెలంగాణకు ఎందులోనూ పోలిక లేదని సిఎం రేవంత్ ఛాలెంజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు తెలంగాణలోనే తయారవుతున్నాయని, 35 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుస్తామన్నారు. 20 వేల ఎకరాల భూమిలో అద్భుతమైన ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సిఎం రేవంత్ తెలిపారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణను చూడండి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాన్ని నిర్మించబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కెసిఆర్‌తో హైదరాబాద్ అభివృద్ధి ప్రారంభం కాలేదు
హైదరాబాద్ అభివృద్ది రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌తోనే ప్రారంభం కాలేదని సిఎం రేవంత్ తెలిపారు. కులీ కుతుబ్ షాల నుంచే హైదరాబాద్ అభివృద్ధి మొదలైందన్నారు. వారి తర్వాత నిజాం రాజులు, బ్రిటీషర్లు, స్వాతంత్య్రం అనంతరం మర్రి చెన్నారెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తాను పని చేస్తున్నానని ఆయన తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర హైదరాబాద్‌కు ఉందని, చార్మినార్, గోల్కొండ కోట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లను చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ నిర్మించారా అని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న ల్యాండ్ మార్క్ డెవలప్‌మెంట్ అంతా 450 ఏళ్ల క్రితం ప్రారంభమై రేవంత్ రెడ్డి వరకు నిరంతరంగా వస్తోంద న్నారు. సిఎంలు, పిఎంలు మారినా పాలసీలు మారకుండా హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
దక్షిణాదిపై బిజెపి పగ…
నియోజక వర్గాల పునర్విభజన పేరిట దక్షిణ భారతదేశంపై పగ, ప్రతీకారం తీర్చుకోవాలని బిజెపి భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. శుక్రవారంనాడు ఇక్కడ జరిగిన ‘ఇండియాటుడే కాంక్లేవ్’లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాన్నే కాకుండా పంజాబ్‌లాంటి రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దక్షిణ భారతంలో బిజెపికి తగినంత ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఈ కారణంగా డీలిమిటేషన్ అనే ఆయుధాన్ని ఆ ప్రాంత ప్రజలపై ప్రయోగించాలని చూస్తోందని దుయ్యబట్టారు. దక్షిణ భారతంలో మొత్తం 240లోక్‌సభ స్థానాలు ఉంటే, అందులో గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిజెపి కేవలం 29 మంది మాత్రమే గెలుచుకోగలిగిందని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అందిపుచ్చుకోవడం ద్వారా లోక్‌సభ స్థానాలు
తగ్గించి తద్వారా దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని బిజెపి కుట్ర పన్నుతోందన్నారు. దక్షిణ భారతంలో ఏ ఒక్క రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వంలో ఉందని రేవంత్ గుర్తు చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించాలన్న తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రతిపాదనకు మద్దతునిస్తామన్నారు. కుటుంబ నియంత్రణ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, దాన్ని సమర్థంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియను మరో 30 సవంత్సరాలు నిలుపుదల చేసి చూడండి, అప్పుడు దక్షిణ భారతంలో జనాభా ఏ మేరకు పెరుగుతుందో ఊహించుకోవాలని రేవంత్ రెడ్డి నవ్వుతూ వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌పై దక్షిణ భారత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ విజయవంతం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపై ఉందన్నారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఇటీవల కులగణన జరిగిన తీరు.. వస్తున్న విమర్శలపై కూడా రేవంత్ స్పందించారు. కులాల జనాభాను తేల్చేందుకు కేంద్ర స్థాయిలో కూడా లెక్కింపు జరగాల్సిన అవసరం ఉందన్నారు. బిసిల డిమాండ్ సరైనదే అయితే రిజర్వేషన్ల కల్పన వారికి ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇప్పటి వరకు ఏ కులం జనాభా ఎంతో నిర్ధిష్టంగా ఎందుకు లెక్కించలేకపోయారని ప్రశ్నించారు. ఏ కంపెనీ అయినా మనుగడ సాధించాలంటే ఆ కంపెనీ ఆస్తులు, టర్నోవర్, లాభ నష్టాలు పక్కాగా లెక్కించుకుంటామని, అలాంటింది దేశానికి కులపరమైన బ్యాలెన్స్ షీట్ ఎందుకు ఉండకూడదన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల జనాభా ఎంత ఉంటుందో తేల్చుతారు కానీ, బిసిలను ఎందుకు విస్మరించారని రేవంత్ ప్రశ్నించారు. కేంద్రం జరపబోయే జనాభా లెక్కల్లోనే కులపరమైన లెక్కలను కూడా ఈ సారి తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని, ఆ దిశగా తీర్మానం కూడా చేసినట్లు వివరించారు. కులగణన ద్వారానే ఆయా వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. ఈ ప్రక్రియను పక్కదోవ పట్టించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆయా వర్గాలకు అన్యాయం తలపెడుతోందని ఆరోపించారు.
హిందీ ఆప్షన్ మాత్రమే…
భాషా పరమైన వివాదాలపై కూడా సిఎం రేవంత్ నిశ్చితాభిప్రాయాన్ని వెలిబుచ్చారు. హిందీ అనేది ఒక ఆప్షనల్ మాత్రమే అని, తప్పనిసరికాదన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలని బిజెపి చూస్తోందని, అయితే ఈ దేశంలో భాషాపరమైన వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అసవరం ఉందన్నారు. హిందీ గురించి మోడీజీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ తెలుగు అత్యధికులు మాట్లాడుతున్న రెండో భాష అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అసలు తాను హిందీ నేర్చుకున్నదే మోడీ కోసమన్నారు. ఆయనతో రాజకీయ పరమైన యుద్ధం చేయడం కోసమే హిందీలో మాట్లాడుతున్నట్లు రేవంత్ చెప్పారు. ప్రాంతీయ భాషలను విస్మరించలేరని, సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి తెలుగును తొలగిస్తారా?అన్ని ప్రశ్నించారు. అదే సమయంలో తాను హిందీకి వ్యతిరేకం కాదన్నారు.
భాషను ఒక పరరికంగా వాడుకోవాలి తప్ప దాన్నొక అవకాశంగా తీసుకోరాదన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇంగ్లీష్‌ను వాడుకోవాల్సి వస్తోందని, కానీ అది మన మాతృభాష కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం గెలుపుకోసం వాడుకుంటోందని ఆరోపించారు. మోడీతో పాటు అదానీతో అంటకాగుతున్నారన్న విమర్శపై రేవంత్ స్పందించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రధానితో ఎలాంటి సంబంధాలు ఉండాలో అలాంటి వాటిని మాత్రమే తాను నిర్వర్తిస్తుతన్నాని స్పష్టం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా తాను రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ఆందోళనలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈడీ, సిబిఐ, ఇన్‌కంటాక్స్‌లు మోడీకి అనుబంధ సంఘాలు
కాంగ్రెస్‌కు యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఉన్నాయని సిఎం రేవంత్ వెల్లడించారు. కానీ, మోడీకి ఈడీ, సిబిఐ, ఇన్‌కంటాక్స్‌లాంటివి అనుబంధ సంఘాలని సిఎం రేవంత్ విమర్శించారు. అదానీకి రూ.100 కోట్లు వెనక్కి ఇవ్వాలని పార్టీ చెప్పలేదని ఆయన తెలిపారు. మా ప్రతిపక్షాలు బిజెపి, బిఆర్‌ఎస్‌లు వ్యతిరేకించాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు కోసం రూ. 100 కోట్లను తీసుకురావాలనుకున్నా. బిజెపి అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదని, తాను వెనక్కి ఇచ్చానని ఎటువంటి అపవాదు ఎదుర్కొదల్చుకోలేదని ఆయన తెలిపారు. తాను భద్రాచలంలో రాముడి గుడి ఉందని చెప్పా, మోడీ, అమిత్ షాలను పిలిచినా ఇప్పటి వరకు వారు రాలేదని సిఎం రేవంత్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఒలంపిక్స్‌ను నిర్వహించాలని లేఖ రాశా…
మరోవైపు హైదరాబాద్‌లో ఒలంపిక్స్ నిర్వహించాలని తాను లేఖ రాశానని అయినా స్పందన లేదని సిఎం తెలిపారు. అహ్మదాబాద్ కంటే హైదరాబాద్‌లో ఒలంపిక్స్‌ను నిర్వహించడానికి తమ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఇప్పటికే మిలటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిందని సిఎం రేవంత్ తెలిపారు. నిఖత్ జరీన్, సానియా మీర్జా, పి.వి.సింధు సహా ఒలింపిక్స్, క్రికెట్లో రాణించిన వారంతా తెలంగాణ నుంచి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ సుందరి పోటీలు మేలో హైదరాబాద్‌లో జరగబోతున్నాయని, ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఎందుకు ఒలింపిక్స్ జరగకూడదని ఆయన ప్రశ్నించారు.