Saturday, December 21, 2024

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం..36 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గర్వాల్ రీజియన్ పౌరి నుంచి కుమాయోన్ రీజియన్ లోని రామ్‌నగర్‌కు బస్సు వెళ్తుండగా, అల్మోరా సరిహద్దు వద్ద రామ్‌నగర్ లోని కుపి సమీపంలో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయపడ్డారు. వీరిని సమీపాన గల రామ్‌నగర్ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురిలో ముగ్గురిని రిషికేష్ లోని ఎయిమ్స్‌కు మరొకరిని హల్‌ద్వానీ లోని సుశీలా తివారీ ఆస్పత్రికి తరలించారు. దీపావళి వేడుక చేసుకుని తిరిగి పనుల్లో చేరడానికి వీరు రాత్రంతా ప్రయాణం సాగించారు. ఇక ప్రయాణం ముగిసిపోయే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమాచారం తెలియడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్‌లు సహాయక చర్యలు చేపట్టారు. గర్వాల్ మోటార్ ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు కెపాసిటీకి మించి కిక్కిరిసి ఉన్నారు.

ఓవర్‌లోడ్ కావడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీస్‌లు అనుమానిస్తున్నారు. ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంటనే వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌరీఅల్మోరా సంబంధిత ప్రాంతం ఆర్డీఓను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పౌరీ, అల్మోరా అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించాలని కుమాయోన్ డివిజన్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ రూ.2 లక్షల వంతున గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News