హైదరాబాద్: వరుణుడు కరణించడంతో భానుడి ఉగ్రరూపం కాస్తా తగ్గుముఖం పట్టింది. 10 రోజులుగా ఎండ వేడిమితో ఉక్కిరి బిక్కిరి అయిన నగరవాసులకు కాస్తా ఉపశమనం లభించింది. గత రెండురోజుల వరకు గ్రేటర్‌లో ఎండలు దంచికొట్టడంతో నగరవాసులు ఉదయం 10 గంటలు దాటితే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రతతో బెంబేలెత్తిపోయిన నగరవాసులు వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ఎసిలు, కూలర్లను అశ్రయించారు . అయితే సోమవారం తెల్లవారు జామున నగర వ్యాప్తంగా భారీ వర్షం కురువడంతో ఎండలు తీవ్రత తగ్గుముఖం పట్టింది.
ఆదివారం వరకు నగరంలో 42.8 డిగ్రీల వరకు వెళ్లిన పగటి ఉష్ణోగ్రతలు వర్షం కారణంగా సోమవారం మాత్రం ఒక్కటి రెండు చోట్ల 40 డిగ్రీలకు నమోదు కాగా చాలా ప్రాంతాల్లో సాధారణ కంటే కూడా తక్కువగానే నమోదు అయ్యాయి. మంగళవారం సైతం నగరంలో మూడు నాలుగు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీలుగా నమోదు కాగా, పలు ప్రాంతాల్లో మాత్రం 3.5.5 నుంచి 40 డిగ్రీల లోపే నమోదు అయ్యాయి. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో 31 నుంచి 36.0 డిగ్రీల మధ్య నమోదు అవుతుండడంతో రాత్రివేళలో నగరవాసులు ఉక్కపోత తప్పడం లేదు.. సఫిల్ గూడలో పగటి ఉష్ణోగ్రత 35.5 డిగ్రీలు నమోదు కాగా, కందికల్ గేట్, కాంచన్ బాగ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలే 36.0 డిగ్రీలు నమోదు కావడం గమన్హారం.
ఇవి సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీలు అధికం కావడంతో నగరవాసులు రాత్రివేళా ఉక్కపోతతో తిప్పలు పడాల్సి వస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతుండడంతో నగరవాసులు వేసవి సెలవు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో సాయంత్రం వేళా నగరంలో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిక్కిరిసి పోతున్నాయి. ముఖ్యంగా నూతన సచివాలయంతోపాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు నగరం నుంచే కాకుండా గ్రేటర్ చుట్టు పక్కల ప్రాంతాల వాసులు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.