మనతెలంగాణ/హైదరాబాద్ : ఎస్‌సి, ఎస్‌టి, బిసి,ఈబిసి, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల బీఆర్వోలను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన రూ.362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్చి 31వ తేదీలోగా వివిధ విభాగాల నుంచి బిల్లులు అందలేదన్న కారణంతో ట్రెజరీ అధికారులు తిప్పిపంపడం జరిగిందని మంత్రి హరీశ్ రావు దృష్టికి రావడంతో దీనిపైన సమీక్షించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధింత శాఖలు తిరిగి ట్రెజరీకి సమర్పించాలని, ఆ బిల్లులను వెంటనే ట్రెజరీ అధికారులు క్లియర్ చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాల బీఆర్వోలను విడుదల చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్ రోస్, కమిషనర్ యోగితారాణా, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.