బీహార్‌లో రైల్వే స్టేషన్‌కు ఆందోళనకారుల నిప్పు
న్యూఢిల్లీ: సాయుధ దళాలలో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో వెల్లువెత్తుతున్న ఆందోళనలను పురస్కరించుకునిఇ శనివారం నాడు 369 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. వీటిలో 210 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 159 లోకల్ పాసింజర్ రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు రెండు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేయడంతో శనివారం మొత్తం 371 రైళ్లు రద్దయినట్లు అధికారులు తెలిపారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో యువజనులు చేపట్టిన నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. రాస్తారోకోలతో పాటు రైల్వే ట్రాకులపై బైఠాయింపు, రైలు బోగీల దహనం వంటి హింసాత్మక సంఘటనలు అనేక చోట్ల చోటుచేసుకున్నాయి. బీహార్‌లో శనివారం ఆందోళనకారులు జరిపిన బంద్ హింసకు దారితీసి పాట్నా జిల్లాలోని మసౌర్హి సబ్ డివిజన్‌లో తారెగన రైల్వే స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బీహార్‌లో 32 రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు మధ్య రైల్వే ప్రకటించింది.