Friday, November 22, 2024

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం: 42మంది జల సమాధి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో విషాదం.. బస్సు కాల్వలో పడి 42మంది జల సమాధి
మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, చిన్నారి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సిఎం

సిధి: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి అదుపు తప్పి వంతెనపైనుంచి కాల్వలోకి పడి పోవడంతో 42 మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సిధి జిల్లాలోని పట్నా గ్రామం వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. తొలుత 18 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే సహాయక చర్యల్లో మరిన్ని మృతదేహాలను గుర్తించారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగి పోవడంతో మరికొంతమంది గల్ల్లంతయ్యారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేవా డివిజినల్ కమిషనర్ రాజేశ్ జైన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 42 మృతదేహాలను గుర్తించినట్లు, వాటిని పోస్టుమార్టం కోసం పంపినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. సిధి జిల్లా కేంద్రంనుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బస్సు పూర్తిగా నీటిలో మునిగి పోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం జిల్లా అధికారులు బనగంగ ప్రాజెక్టునుంచి కాల్వలోకి నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో కాల్వలో నీటిమట్టం తగ్గింది.ఆ తర్వాత బస్సు అది పడిన ప్రాంతానికి కొద్ది దూరంలో కనిపించింది. తర్వాత రెండు క్రేన్ల సాయంతో బస్సును బైటికి తీశారు. కాగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పర్యటనను రద్దు చేసింది.
మృతులకు రూ.5 లక్షల పరిహారం
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇద్దరు రాష్ట్రమంత్రులు తులసీరాం సిలావత్,రాంఖేలావన్ పటేల్ సంఘటనా స్థలానికి వెళ్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు.
ప్రధాని, ఉపరాష్ట్రపతి సంతాపం
ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.స్థానిక అధికారులు సహాయక చర్యల్లో చురుగ్గా నిమగ్నులై ఉన్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ ఘటనలో మృతులకు ప్రధాని సహాయనిధినుంచి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల సాయాన్ని ప్రకటించారు.
సిఎంకు అమిత్ షా ఫోన్
ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అమిత్ షాతో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News