కొన్ని పదాలైనా చదవలేని అసమర్ధతలో 48 శాతం మంది
లాక్‌అవుట్ ప్రభావంతో విపరీత పరిణామాలపై స్కూల్ సర్వే
న్యూఢిల్లీ : కొవిడ్ సంక్షోభ కాలంలో సుదీర్ఘకాలం దేశం లోని పాఠశాలలను మూసివేయడంతో విపత్తు పరిణామాలు సంభవించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 37 శాతం మంది విద్యార్థులు చదువులు లేకుండా ఉన్నారని, 48 శాతం మంది విద్యార్థులు కొన్ని పదాలనైనా చదవలేని పరిస్థితిలో ఉన్నారని ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. ‘లాక్డ్ అవుట్ : ఎమర్జెన్సీ రిపోర్టు ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ ’ పేరున ఆగస్టులో నిర్వహించిన ది స్కూల్ చిల్డ్రన్స్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ లెర్నింగ్ సర్వేలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వెనుక బడిన కుటుంబాలకు చెందిన దాదాపు 1400 మంది విద్యార్థులను చేర్చారు. అసోం, బీహార్, ఢిల్లీ, హర్యానా, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వే పూర్తి నిరాశాజనకమైన చిత్రాన్ని ప్రతిబింబించింది. సర్వే సమయంలో గ్రామాల్లో కేవలం 28 శాతం మంది విద్యార్థులే రెగ్యులర్‌గా చదువుతున్నారని, 37 శాతం మంది చదవడం లేదని తేలింది. అర్బన్ ఏరియాల్లో రెగ్యులర్‌గా చదువుతున్నవారు. అసలు చదవని వారు, కొన్ని పదాలనైనా చదవలేని వారు ఈ విధంగా పరిశీలిస్తే క్రమంగా 47 శాతం, 19 శాతం, 42 శాతంగా తేలింది.
ఈ సర్వే సాధారణంగా వెనుకబడిన గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించింది. దేశం మొత్తం మీద స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు కరోనా ప్రారంభమైన తరువాత ఏడాదిన్నర కాలం పాటు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకోవడంతో అనేక రాష్ట్రాలు సెప్టెంబర్ నుంచి దశల వారీగా పాఠశాలలను ప్రారంభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో రెగ్యులర్‌గా చదువుతున్న వారి నిష్పత్తి అర్బన్ ఏరియాల్లో 24 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం వరకు ఉంది. డబ్బులేక పోవడం, అనుసంధానం లోపించడం, లేదా స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానం లేకపోవడం, తదితర కారణాల వల్ల ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ చాలా పరిమితమైపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో సగానికి సగం కుటుంబాలకు స్మార్ట్‌ఫోన్లు లేవు. అది మొట్టమొదటి ప్రధాన అడ్డంకి. స్మార్ట్‌ఫోన్ ఉన్న కుటుంబాలైనా సరే రెగ్యులర్‌గా ఆన్‌లైన్ ద్వారా చదివేవారు అర్బన్ ఏరియాల్లో 31 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం వరకు ఉన్నట్టు తేలింది. ఇక వెనుకబడిన ్ల దళితులు, ఆదివాసీ కుటుంబాల్లో ఆన్‌లైన్ విద్యాభ్యాసం కానీ, రెగ్యులర్‌గా చదివేవారు కానీ, చదివే సామర్థం కానీ లేకపోవడం బాగా కనిపించింది ఉదాహరణకు గ్రామీణ ఎస్‌సి, ఎస్‌టి పిల్లల్లో కేవలం 4 శాతం మంది , మిగతా గ్రామీణ విద్యార్థుల్లో 15 శాతం మంది మాత్రమే రెగ్యులర్‌గా ఆన్‌లైన్ ద్వారా చదువుతున్నట్టు , సర్వేలో తేలింది.
లాక్‌డౌన్ వల్ల తమ పిల్లల చదువులు బాగా దెబ్బతిన్నాయని అత్యధిక శాతం తల్లిదండ్రులు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. కేవలం 4 శాతం తల్లిదండ్రులే తమ పిల్లలకు లాక్‌డౌన్ కాలంలో చదవడం, రాయడం బాగా వచ్చిందని పేర్కొన్నారు. అర్బన్ ఏరియాల్లో 23 శాతం మంది. గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్‌లైన్ అనుసంధానం ఉన్నట్టు వెల్లడించారు. ఎస్‌సి, ఎస్‌టి తల్లిదండ్రుల్లో 98 శాతం మంది వీలైనంత త్వరగా స్కూళ్లు ప్రారంభించాలని ఆకాంక్షించారు. స్కూళ్లు మళ్లీ ప్రారంభించాలన్నది ఇంకా చర్చనీయాంశం గానే ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోటును సరిదిద్దడానికి కొన్నేళ్లు పడుతుందని సర్వే అభిప్రాయ పడింది. ఎకనామిస్టులు జీన్‌డ్రెజ్, నిరాళిభక్లా తదితర నిపుణుల సహకారంతో దాదాపు వందమంది వాలంటీర్లు దేశంలో ఈ సర్వే నిర్వహించారు.