Thursday, January 9, 2025

భారత్‌చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గేనా?

- Advertisement -
- Advertisement -

భారత్ 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరిస్తూ రాజ్యాంగంలో ని 370 అధికరణాన్ని రద్దు చేసినప్పుడు చైనా ఆ చర్యను యుఎన్ భద్రతా మండలిలో ఖండించింది. కశ్మీర్‌లో ఎక్కువ ఎత్తులోని లడఖ్ అంతర్భాగంగా ఉండేది. దానిలో కొన్ని ప్రాంతాలను చైనా తనవిగా చెప్పుకుంటున్నది, ఆ భూభాగాల్లో మొదటిదైన అక్సాయ్ చిన్ చైనా పరిపాలనలో ఉన్నది. కానీ, అది తనదని భారత్ వాదిస్తోంది; ఆ ప్రాంతంలో అధిక భాగం నివాసులు లేని ఎక్కువ ఎత్తైన బంజరు భూమి కానీ అంచులో కొంత మేరకు పచ్చిక భూములతో ఉన్నది. అది కశ్మీర్, టిబెట్, గ్జిన్‌జియాంగ్ కూడలిలో ఉన్నది, దాని మీదుగా చైనా గ్జిన్‌జి యాంగ్ టిబెట్ రహదారి వెళుతోంది.

సుదీర్ఘ కాలం ప్రతిష్టంభన అనంతరం తూర్పు లడఖ్‌లోను, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ రంగంలోను సేనల ఉపసంహరణలో చైనా, భారత మిలిటరీలు గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి. ఉభయ దేశాల రక్షణ శాఖ మంత్రులు నవంబర్ చివరి వారంలో ఫలప్రదమైన సమావేశం నిర్వహించి, సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గింపునకు అంగీకరించారు. నాలుగు సంవత్సరాలకు పైగా ప్రతిష్టంభన అంతానికి భారత్‌తో సరిహద్దు ఒప్పందం అమలులో ‘గొప్ప పురోగతి’ సాధించినట్లు చైనీస్ మిలిటరీ నవంబర్ 23న వెల్లడించింది. రెండు దేశాల రక్షణ శాఖ మంత్రుల మధ్య ఇటీవలి సమావేశం సకారాత్మకమైనదని, నిర్మాణాత్మకమైనదని చైనా మిలిటరీ అభివర్ణించింది. అయితే, రెండు పక్షాలు ఒప్పందం వివరాలను వెల్లడించలేదు.

తూర్పు లడఖ్‌లో ఎల్‌ఎసి పొడుగునా గస్తీ, సేనల ఉపసంహరణపై భారత్ చైనా ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ధ్రువీకరించి, వివిధ ద్వైపాక్షిక చర్చల యంత్రాంగాల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. గల్వాన్ లోయలో 2020లో ప్రాణాంతక మిలిటరీ సంఘర్షణ వల్ల దెబ్బతిన్న సంబంధాలను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చే యత్నాలకు అది సూచిక అయింది. 2020లో సంఘర్షణ కొన్ని దశాబ్దాల్లో రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య అధ్వాన ఘర్షణగా మారింది. ఆ ఘర్షణలో కనీసం 20 మంది భారతీయ జవాన్లు, నలుగురు చైనా జవాన్లు మృతి చెందారు. 2019 అక్టోబర్ తరువాత మోడీ, జిన్‌పింగ్ బ్రిక్స్ కజాన్ సమ్మిట్ సందర్భంగా గత అక్టోబర్ 23న తమ తొలి ఇష్టాగోష్టి నిర్వహించారు.

ఉభయ నేతలు 2022లో బాలిలో జి20 సమ్మిట్‌లో విడిగా భేటీ అయ్యారు. కొన్ని నెలల అనంతరం, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఆ సమావేశంలో వారు ‘ఏకాభిప్రాయానికి’ వచ్చినట్లు చైనా తెలియజేసింది. జోహన్నెస్‌బర్గ్‌లో 2023 బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా ఆ ఇద్దరు అధినేతలు కూడా లాంఛనప్రాయంగా భేటీ అయ్యారు. సేనల ఉపసంహరణకు, ఉద్రిక్తల తగ్గింపునకు ముమ్మరంగా కృషి చేయాలని వారు అంగీకరించారు. 2023లో కజక్‌స్తాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) సమ్మిట్ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యిని కలుసుకుని, చర్చల స్థాయి పెంపునకు అంగీకరించారు.

భారత్ చైనా సంబంధాలు దశాబ్దాల పాటు ఉద్రిక్తతల ప్రభావానికి గురయ్యాయి సరిగ్గా నిర్వచించని, 3440 కిమీ నిడివి వివాదాస్పద సరిహద్దు అందుకు మూల కారణం. సరిహద్దు పొడుగునా నదులు, సరస్సులు, హిమ వర్షాలు తరచు సరిహద్దు రేఖలను మారుస్తుండేవి, దీనితో అనేక చోట్ల సైనికులు ముఖాముఖి తలపడుతుండేవారు, అది సంఘర్షణకు దారి తీస్తుండేది. ఆసియాలో వలసవాద విధానం చారిత్రక పర్యవసానాల, స్పష్టమైన చారిత్రక సరిహద్దు గుర్తింపులు లేకపోవడం వల్ల రెండు దేశాల మధ్య భూవివాదాలు తలెత్తుతుండేవి.

భారత్, చైనా 1962లో యుద్ధం చేశాయి. దానిలో భారత్ భారీ ఓటమికి గురైంది. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య పలు సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చైనా సేనలు పశ్చిమాన లడఖ్‌లో భారతీయ సరిహద్దు కేంద్రాలపైన దాడి చేసి, తూర్పున మెక్‌మహాన్ రేఖను దాటాయి. సిక్కిం ప్రాంతంలో అంగీకృత సరిహద్దు ఉన్నప్పటికీ 1967లో ఆ ప్రాంతంలో స్వల్పంగా సరిహద్దు ఘర్షణ జరిగింది. 1987లోను, 2013లోను వాస్తవ నియంత్రణ రేఖలు (ఎల్‌ఎసి)పై సంఘర్షణలు జరిగే అవకాశాన్ని తప్పించారు. 2017లో భూటాన్, చైనా మధ్య సరిహద్దులో భూటాన్ నియంత్రిత ప్రాంతంలో వివాదం సమయంలో భారత్, చైనా జవాన్లకు గాయాల తరువాత ఆ రెండింటి మధ్య వివాదాన్ని జయప్రదంగా పరిహరించారు. 2020లో అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అది 2020 జూన్‌లో అనేక మరణాలకు గాయాలకు దారి తీసింది.

భారత్ 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరిస్తూ రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేసినప్పుడు చైనా ఆ చర్యను యుఎన్ భద్రతా మండలిలో ఖండించింది. కశ్మీర్‌లో ఎక్కువ ఎత్తులోని లడఖ్ అంతర్భాగంగా ఉండేది. దానిలో కొన్ని ప్రాంతాలను చైనా తనవిగా చెప్పుకుంటున్నది, ఆ భూభాగాల్లో మొదటిదైన అక్సాయ్ చిన్ చైనా పరిపాలనలో ఉన్నది. కానీ, అది తనదని భారత్ వాదిస్తోంది; ఆ ప్రాంతంలో అధిక భాగం నివాసులు లేని ఎక్కువ ఎత్తైన బంజరు భూమి కానీ అంచులో కొంత మేరకు పచ్చిక భూములతో ఉన్నది. అది కశ్మీర్, టిబెట్, గ్జిన్‌జియాంగ్ కూడలిలో ఉన్నది, దాని మీదుగా చైనా గ్జిన్‌జియాంగ్ టిబెట్ రహదారి వెళుతోంది.

మరొక వివాదాస్పద భూభాగం ఒకప్పుడు ఈశాన్య సరిహద్దు సంస్థ (నీఫా)గా పేర్కొన్న ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌గా ఉన్న ప్రాంతంలో మెక్‌మహాన్ రేఖకు దక్షిణంగా ఉన్నది. దానిని భారత్ పాలిస్తోంది, కానీ చైనా తనదిగా పేర్కొంటుంటుంది. 1914 సిమ్లా కన్వెన్షన్‌లో భాగంగా బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య మెక్‌మహాన్ రేఖపై ఒప్పందం జరిగింది, అయితే, చైనా దానిని ఎన్నడూ ధ్రువీకరించలేదు. చైనా మెక్‌మహాన్ రేఖ ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నది, సిమ్లా కన్వెన్షన్‌పై సంతకాలు జరిగినప్పుడు టిబెట్ స్వతంత్ర దేశం కాదని చైనా వాదిస్తోంది. గ్రేట్ బ్రిటన్, చైనా, టిబెట్ మధ్య సిమ్లా కన్వెన్షన్ 1913, 1914లో సిమ్లాలో చైనా రిపబ్లిక్, టిబెట్, గ్రేట్ బ్రిటన్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపిన టిబెట్ హోదాకు సంబంధించిన అస్పష్టమైన సంధి. టిబెట్‌ను ‘ఔటర్ టిబెట్’, ‘ఇన్నర్ టిబెట్’గా విభజించాలని సిమ్లా కన్వెన్షన్ ప్రతిపాదించింది. సుమారుగా ఉత్సాంగ్, పశ్చిమ ఖామ్‌తో కూడిన ఔటర్ టిబెట్ ‘చైనా ఆధిపత్యం కింద లాసాలో టిబెట్ ప్రభుత్వం అధీనంలో’ కొనసాగుతుంది, కానీ, దాని పరిపాలనలో చైనా జోక్యం చేసుకోదు. సుమారుగా అందో, తూర్పు ఖామ్‌తో సమానమైన ‘ఇన్నర్ టిబెట్’ చైనా ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. టిబెట్, చైనా మధ్య సరిహద్దును, టిబెట్, బ్రిటిష్ ఇండియా మధ్య సరిహద్దును కూడా కన్వెన్షన్ నిర్వచించింది. రెండవది మెక్‌మహాన్ రేఖగా పరిగణన పొందింది.

మిలిటరీ వివాదం కూడా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసింది. దేశంలో చైనా పెట్టుబడులపై తన నిశిత పరిశీలనను ఢిల్లీ హెచ్చించింది, టిక్‌టాక్ సహా పాప్యులర్ చైనా యాప్‌లు పెక్కింటిని నిషేధించింది. చైనాకు సరాసరి విమాన సర్వీసులను కూడా భారత్ నిలిపివేసింది. చైనీస్ సంస్థల పెట్టుబడులపై పరిశీలనను భారత్ కట్టుదిట్టం చేయడమే కాకుండా పెద్ద ప్రాజెక్టులను నిలిపివేసింది. సరిహద్దు సంఘర్షణల దరిమిలా చైనీస్ పెట్టుబడులను భారత్ నిశితంగా పరిశీలిస్తుండడం వల్ల ఆటోమొబైల్, బ్యాటరీ తయారీ సంస్థ బివైడి ఆటో కంపెనీ లిమిటెడ్, గ్రేట్ వాల్ మోటార్ వంటి చైనీస్ బహుళ జాతీయ తయారీ సంస్థల నుంచి బిలియన్ల డాలర్ల మేరకు పెట్టుబడులు మళ్లాయి. అయినప్పటికీ, 2020 సరిహద్దు ఘర్షణ దరిమిలా చైనా నుంచి భారత్ దిగుమతులు 56 శాతం మేర పెరిగాయి. బీజింగ్‌తో న్యూఢిల్లీ వాణిజ్య లోటు 85 బిలియన్ డాలర్లకు దాదాపుగా రెట్టింపు అయింది. చైనా ఇప్పటికీ భారత్‌కు సరకుల వనరుగా ఉంటున్నది, నిరుడు అతి పెద్ద పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరాదారుగా ఉన్నది.

ప్రభుత్వం, ఆర్మీ చెబుతున్నదానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని రక్షణ పరిశీలకులు అంటున్నారు. భారత్ చైనా మధ్య కుదిరిన ఒప్పందం 2020 ముందునాటి ప్రాంతంలో ఉన్న యథాతథా స్థితికి తిరిగి వెళ్లడం కిందకు రాదని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. విదేశాంగ మంత్రిత్వశాఖ, ఆర్మీ చీఫ్ ప్రకటనల మధ్య విరుద్ధ వైఖరులు సదరు ఒప్పందంపై అనుమానాలకు కారణాలు అని పరిశీలకులు అంటున్నారు. ఉద్రిక్తతలు తగ్గలేదని, అది సేనల ఉపసంహరణ మాత్రమేనని రక్షణ పరిశీలకులు అనేక మంది చెప్పారు. అంటే దెప్సాంగ్, దెమ్చోక్‌లలో ఇక ఎంత మాత్రం ఘర్షణలు ఉండవన్నమాట. 2020లో తాము ఆక్రమించుకోవడానికి వచ్చిన ప్రాంతాన్ని చైనా ఖాళీ చేసిందని దాని అర్థం కాదు.

ఆ ప్రాంతాల్ల్లో గస్తీకి భారత్‌ను వారు అనుమతించారని మాత్రమే దాని అర్థం. 2017లో డోక్లామ్ ప్రతిష్టంభన తరువాత చైనీస్ సైన్యం ఆ ప్రాంతంలో శాశ్వత ఉనికిని సాధించడం చూశాం. ప్రధాని సంక్షోభంలో సమర్థంగా వ్యవహరించారని, ప్రతిష్టంభన సంక్షోభం ఇప్పుడు ముగిసిందని, దాని వల్ల ప్రతిపక్షాల నుంచి రాజకీయ ఇరకాట స్థితిని ఆయన తప్పించుకోవచ్చునని ప్రత్యర్థులకు చూపడమే ఆ ప్రకటనకు కారణమని రాజకీయ పరిశీలకుల్లో ఒక వర్గం అంటున్నది. చైనా అసలు ఉద్దేశం గురించి ప్రతిపక్షాలు, ప్రజల భయాందోళనలు పరిహరించేందుకు, శక్తిమంతమైన పొరుగు దేశంతో వ్యవహరించడంలో మోడీ ప్రభుత్వ దౌత్యబలాన్ని చూపేందుకు చైనా ప్రభుత్వంతో సేనల ఉపసంహరణ ఒప్పందం పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలి.

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,
రాజకీయ అంశాల విశ్లేషకుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News