అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఠా గుడి, గుడిలోని లింగాన్ని దోచేశారని ప్రభుత్వ సలహాదారు, వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం సజ్జల మీడియాతో మాట్లాడారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే డబ్బులు దోచేశారని, స్కిల్ స్కామ్‌లో రూ.370 కోట్లు దారి మళ్లించారని, సీమెన్స్ కంపెనీ తమకు డబ్బు రాలేదని చెప్పిందని గుర్తు చేశారు. డిజైన్‌టెక్, ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్లు తేలిందన్నారు. అవినీతి జరగలేదంటే ఎలా కుదురుతుందని అని సజ్జల ప్రశ్నించారు.
Also Read: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం: అస్సాం సిఎం హిమంత
అసలు ఒప్పందంలో రూ.3300 కోట్లు అనేదే లేదని, జివొలో ఉన్న అంశాలు ఎంవొయులో లేవని, అమరావతి స్కామ్, స్కిల్ స్కామ్ అన్నీ బయటకు వస్తాయని, అడ్డంగా చేసిన తప్పులకు అధారాలు ఉన్నాయని, వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న నమ్మకంతోనే అక్రమాలకు పాల్పడ్డాడని, ఎల్లవేళలా వ్యవస్థలను మేనేజ్ చేయడం కుదరదన్నారు. అడ్డంగా దొరికినా తమ బాబు సుద్ధపూస అంటే జనం నమ్మరని సజ్జల ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉన్నారని, ఇన్నాళ్లు పవన్-చంద్రబాబు విడివిడిగా ఉన్నట్లు నటించారని, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఈ స్థాయిలో మద్దతు లేదని, తొలిసారిగా 75 శాతం పైగా మద్దతు తమకు వచ్చిందని, ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో ఈ మాట చెబుతున్నానని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని సజ్జల స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలుకొట్టారు. సినిమా డైలాగ్‌లు చెప్పినట్లు బయట చెప్తే జనం నవ్వుతారని, రియాలిటీకి దగ్గరగా జనం ఉన్నారని, రీల్‌కు దగ్గరగా పవన్ ఉన్నారని చురకలంటించారు.