హైదరాబాద్ : మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డ వాహనదారులు 372మందికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు పట్టుబడ్డారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, జిడిమెట్ల, మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, అల్వాల్, రాజేంద్రనగర్, శంషాబాద్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతు పట్టుబడిన వారికి కూకట్‌పల్లి కోర్టు రూ.15,26,000 జరిమానా విధించింది.
ఇందులో కొందరికి కోర్టు జరిమానా విధించగా 372మందికి జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి 238మందికి రూ.6,71,700 జరిమానా విధించారు. గత నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మాదాపూర్ పరిధిలో 27, మియాపూర్ 110, కూకట్‌పల్లి 109, బాలానగర్ 40, రాజేంద్రనగర్ 19, శంషాబాద్ 11, గచ్చిబౌలిలో 39మంది, షాద్‌నగర్ 17మందికి జైలు శిక్ష విధించారు. షాద్‌నగర్‌లో అత్యధికంగా 152మంది, కూకట్‌పల్లిలో 150మంది పట్టుబడ్డారు.