బెంగళూరు : ఆసుపత్రిలో హౌస్‌సర్జన్ వైద్యవిద్యార్థుల కుర్రచేష్టలకు శిక్షలుపడ్డాయి. కర్నాటకలోని గడగ్ ఇనిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గిమ్స్)లో తమ వృత్తి అనుభవాలను తెలియచేస్తూ రీల్ ఇట్ ఇట్ పేరిట సామాజిక మాధ్యమంలో విద్యార్థులు వీడియోలు పెట్టారు. వీరి చర్యపై సంస్థ చర్యకు దిగింది. వీరికి జరిమానాలతో పాటు వీరి శిక్షణాకాలాన్ని మరో పదిరోజులు పొడిగించింది. ఆసుపత్రి నియమనిబంధనలను పాటించకుండా ఈ వైద్య విద్యార్థులు లోపల బెడ్‌లపై రోగులుగా పడుకోవడం, మరికొందరు చికిత్స నిర్వహిస్తున్నట్లుగా నటించడం వంటి చేష్టలకు దిగారు. ఇవి సోషల్‌మీడియాలో ప్రచారం పొందడంతో కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో ఈ వైద్య సంస్థ వీరిపై చర్యలకు దిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు దిగిన వారిని గుర్తించామని , ఈ 38 మందిపై తగు విధంగా చర్యలు తీసుకుంటున్నామని గడగ్ వైద్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ బస్వరాజు బొమ్మన్‌హళి ఆదివారం ప్రకటించారు.
ఆసుపత్రిలలో రోగులకు అసౌకర్యం కల్గిస్తూ విద్యార్థులు ఈ విధంగా వీడియోలకు దిగడం పద్ధతి కాదని , వారికి ఉత్సాహంగా ఉంటే తమ వృత్తిని తెలియచేసుకునేందుకు ఆసుపత్రి వెలుపల ఇటువంటివి చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. పట్టాల ప్రదాన కార్యక్రమం కోసం తాము వీడియోలకు దిగామని విద్యార్థులు చేస్తున్న వాదనను అధికారులు తోసిపుచ్చారు. ఇందుకు తాము అనుమతించలేదని, వారి హౌస్‌సర్జన్ షిప్‌ను పొడిగించామని వివరించారు. ఇక చిత్రదుర్గ ఆసుపత్రిలో ఇటీవలే ఓ డాక్టర్ ఏకంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు దిగడాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ డాక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఆపరేషన్ థియేటర్‌లోనే ఈ డాక్టర్ తన పెళ్లి ముందస్తు వేడుకకు దిగాడు. ఈ నేపథ్యంలో కొందరు వైద్యవిద్యార్థులు హిందీ, కన్నడ సినిమా పాటలకు డాన్స్ చేయడం వంటివి చేశారు.