మనతెలంగాణ/హైదరాబాద్ : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం 38 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కొల్లం, కొట్టాయం మధ్య వీటిని నడుపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు వచ్చే నెల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు తిరుగు ప్రయాణంలో కొల్లాం, కొట్టాయం నుంచి తెలుగు రాష్ట్రాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
రైళ్ల వివరాలు ఇలా…
హైదరాబాద్ టు -కొల్లం (నం.07133) డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుందని, జనవరి 2, 9, 16 తేదీల్లో నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. కొల్లం- టు హైదరాబాద్ (నం.07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో నడుపనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ మీదుగా వెళ్లనుంది.
సికింద్రాబాద్- టు కొట్టాయంల మధ్య
సికింద్రాబాద్- టు కొట్టాయం (నం. 07125)ల మధ్య డిసెంబర్ 4,11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం- టు సికింద్రాబాద్ (నం.07126)ల మధ్య డిసెంబర్ 5, 12, 19, జనవరి 2, 9 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇది చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు మీదుగా ప్రయాణిస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
నర్సాపురం- టు కొట్టాయం (నం. 07119)ల మధ్య డిసెంబర్ 2,9,16,30, జనవరి 6,13వ తేదీల్లో ఈ రైలును నడుపనున్నట్టు అధికారులు తెలిపారు.
కొట్టాయం టు -నర్సాపురం….
కొట్టాయం టు -నర్సాపురం (నం. 07120) డిసెంబర్ 3,10,17,3వ తేదీలతో పాటు జనవరి 7,14వ తేదీల్లో అందుబాటులో ఉంటుందని ఈ రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇది పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరుతో పాటు ప్రాధాన స్టేషన్‌లలో ఆగుతుంది.