సినీనటుడు మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)కు చెందిన 38 మంది ఎంఎల్‌ఏలు బిజెపితో సంప్రదింపులు జరుపుతున్నారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాషాయ కండువా కప్పుకున్న సినీనటుడు మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఈ 38 మందిలో 21 మంది ఎంఎల్‌ఏలు నేరుగా తనతోనే టచ్‌లో ఉన్నట్లు బుధవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మిథున్ తెలిపారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ఒక రోజు ఉదయం ముంబైలో ఉండగా దినపత్రికల్లో చదివానని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని 18 రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉందని, త్వరలోనే మరికొన్ని రాష్ట్రాలలో పార్టీ పతాకం ఎగురడం ఖాయమని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి తన పోరాటం ఆపదని, రాష్ట్రంలో ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే తదుపరి ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా..మిథున్ ఆరోపణలపై టిఎంసి ఘాటుగా స్పందించింది. తప్పుడు వాదనలతో ప్రజలను మోసం చేయడానికి మిథున్ ప్రయత్నిస్తున్నారంటూ టిఎంసి ఎంపి శంతను సేన్ విమర్శించారు.